ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో గత నెలలో జరిగిన మహాకుంభమేళాలో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఐఐటీ బాబా ఇపుడు గంజాయితో చిక్కిపోయాడు. దీంతో ఆయనను జైపూర్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. జైపూర్‌లోని ఓ హోటల్‌లో ఉన్న ఐఐటీ బాబా నుంచి గంజాయి, ఇంకా పలు రకాలైన మాదకద్రవ్యాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
దీనిపై ఐఐటీ బాబా స్పందిస్తూ, తన వద్ద లభించింది గంజాయి కాదని, ప్రసాదం అంటూ వాదిస్తున్నారు. ఈ ప్రసాదం సేవించడం తప్పు అయితే, కుంభమేళాలో అనేక మంది ఈ ప్రసాదాన్ని తీసుకున్నారని, వాళ్లందరినీ అరెస్టు చేయాల్సి ఉంటుందన్నారు. అయితే, జైపూర్ పోలీసులు మాత్రం అతనిపై అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే, ఈ కేసులో ఐఐటీ బాబాను స్టేషన్ బెయిలుపైనే విడుదల చేయడం గమనార్హం.
కాగా, కుంభమేళా సందర్భంగా మంచి పాపులారిటీ దక్కించుకున్న ఈ ఐఐటీ బాబా... ఇటీవల చాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ పై స్పందిస్తూ భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి పరుగులు చేయలేరని, ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోతుందంటూ జోస్యం చెప్పారు. కానీ ఈ మ్యాచ్‌లో కోస్లి సెంచరీ చేయడంతో పాటు ఒంటి చేత్తో భారత్‌ను గెలిపించాడు. దీంతో ఐఐటీ బాబాపై క్రికెట్ అభిమానులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత టీవీ చానెల్ డిబేట్‌లో తనను కొట్టారంటూ ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ఈ వ్యవహారం సద్దుమణిగిందని అనుకునేలోపు తాజాగా ఆయనను గంజాయి కేసులో అరెస్టు చేశారు.