ఎస్.ఆర్.ఎం. ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, తిరుచురాపల్లి ప్రాంగణాన్ని గురువారం చెన్నై రాజ్ భవన్ నుంచి అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టోక్యో ఒలింపిక్స్ లో భారత అథ్లెట్లు, పారాలింపియన్లు కనబర్చిన ప్రదర్శన యావత్ భారతీయులు గర్వపడేలా ఉందన్నారు. పారాలింపియన్లు అద్భుతమైన ప్రదర్శనతో భారతదేశానికి 19 పతకాలు తీసుకురావడం గర్వించదగిన విషయమన్న ఆయన, దివ్యాంగత్వం వ్యక్తిగత, దేశ వికాసానికి అవరోధం కాదనే విషయాన్ని పారాలింపియన్లు మరోసారి నిరూపించారన్నారు. మరెంతో మంది అవనీ లేఖర్లు, నీరజ్ చోప్రాలు తమ రెక్కలతో పైకి ఎదిగేందుకు సిద్ధంగా ఉన్నారన్న ఆయన, అలాంటి నైపుణ్యాన్ని ఆదిలోనే గుర్తించి దానికి సానబెట్టేందుకు అవసరమైన ప్రోత్సాహభరితమైన వాతావరణాన్ని నిర్మించాని, ఇందులో విద్యాసంస్థల పాత్ర కూడా కీలకమని పేర్కొన్నారు.
కరోనా సమయంలోనూ ప్రభుత్వం చేసిన క్లినికల్ ట్రయల్స్ లో అనుసంధానమైన పనిచేయడంతోపాటుగా కరోనా ప్రభావిత ప్రాంతాల్లో వైద్య వసతుల కల్పనకోసం కృషిచేసిన ఎస్.ఆర్.ఎం. గ్రూపును ఉపరాష్ట్రపతి అభినందించారు. ఆత్మనిర్భర భారత లక్ష్యాలను చేరుకునేందుకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో పనిచేస్తున్న ఈ గ్రూప్ వ్యవస్థాపకుడు డాక్టర్ టీఆర్ పారివేందర్ ను ఉపరాష్ట్రపతి అభినందించారు.
ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ శ్రీ భన్వరీలాల్ పురోహిత్, ఎస్.ఆర్.ఎం. వ్యవస్థాపక కులపతి, పార్లమెంటు సభ్యుడు శ్రీ టీఆర్ పారివెందర్, ఎస్.ఆర్.ఎం. సంస్థ అధ్యక్షుడు వ్రీ నిరంజన్ తొపాటుగా రామాపురం, తిరుచిరాపల్లి ఎస్.ఆర్.ఎం. సంస్థల ప్రాంగణ అధ్యాపకుడు, విద్యార్థులు, వివిధ రంగాల ప్రతినిధులు అంతర్జాల వేదిక ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.