జయలలిత శరీరంలోకి ఐదున్నర లీటర్ల రసాయనాలు...

గురువారం, 4 జనవరి 2018 (09:41 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతి ఓ మిస్టరీ. ఈ మిస్టరీని ఛేదించేందుకు జస్టీస్ ఆర్ముగస్వామి నేతృత్వంలో నిజ నిర్ధారణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ కమిటీ విచారణలో అనేక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
 
తాజాగా జయలలిత శరీరంలోకి ఐదున్నర లీటర్ల రసాయనాలను ఎక్కించినట్టు మద్రాస్ మెడికల్ కాలేజీ (ఎంఎంసీ) అనాటమీ విభాగం చీఫ్ డాక్టర్ సుధా శేషయ్యన్ వెల్లడించారు. ఈ రసాయనాలను ఎంబ్లామింగ్‌ చికిత్స కోసం ఎక్కించామని తెలిపారు. రసాయనాలను శరీరంలోకి ఎక్కించేందుకు జయలలిత ఎడమ దవడపై రంధ్రాలు చేసినట్టు ఆమె విచారణ కమిటీకి తెలిపారు. జయలలితకు ఉన్న అత్యంత సన్నిహితురాళ్ళలో సుధా శేషయ్యన్ ఒకరు. 
 
ఈమె విచారణ కమిటీకి ఇచ్చిన వాంగ్మూలంలోని విషయాలను పరిశీలిస్తే, "అమ్మ మరణించిన రోజు రాత్రి 10 గంటలకు ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చింది. ప్రజలు సందర్శించే వరకు మృతదేహం చెడిపోకుండా, దుర్వాసన రాకుండా ఎంబ్లామింగ్ చేయడానికి తనను రమ్మన్నారు. తన వైద్య బృందంతో ఆసుపత్రికి చేరుకుని మృతదేహంలోకి రసాయనాలు ఎక్కించేందుకు జయ ఎడమ దవడపై నాలుగు రంధ్రాలు చేసినట్టు వివరించారు. 
 
ఈ రంధ్రాల ద్వారా మిథనాల్ సహా వివిధ రసాయనాలు కలిగిన ఐదున్నర లీటర్ల మిశ్రమాన్ని జయ శరీరంలోకి ఇంజెక్షన్ల ద్వారా ఎక్కించినట్టు తెలిపారు. తీవ్ర అస్వస్థతకు గురైన జయలలిత చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. 75 రోజుల చికిత్స తర్వాత డిసెంబరు 5, 2016న తుదిశ్వాస విడిచిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు