తన కారుకు దారివ్వలేదన్న కోపంతో ఓ కానిస్టేబుల్ బట్టలిప్పించి నగ్నంగా కూర్చోబెట్టారో జడ్జి. ఈ ఘటనపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సీరియస్ అయింది. పైగా, అలా ప్రవర్తించిన జడ్జిపై కూడా బదిలీవేటు వేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం ఉదయం డ్రైవర్ కానిస్టేబుల్ ఘరేలాల్ ఇద్దరు విచారణ ఖైదీలను, ముగ్గురు కానిస్టేబుళ్లను పోలీసు వ్యానులో ఎక్కించుకుని కోర్టుకు బయలుదేరాడు. మరో వంద మీటర్లు ప్రయాణిస్తే వ్యాను కోర్టుకు చేరుకుంటుందనగా వెనుక జడ్జి కారు వచ్చింది.
జడ్జి కారు దారి కోసం హారన్ మోగించినప్పటికీ రోడ్డు ఇరుకుగా ఉండడంతో వ్యాను డ్రైవర్ ఘరేలాల్‌కు దారివ్వలేక పోయారు. అనంతరం కోర్టుకు చేరుకున్న జడ్జి ఘరేలాల్‌ను తన గదికి పిలిచి దారివ్వనందుకు చీవాట్లు పెట్టారు. ఆయన యూనిఫాం, బెల్టు విప్పించి అరగంటపాటు నిల్చోబెట్టి అవమానించారు.
ఘరేలాల్‌కు జరిగిన అవమానంపై స్పందించిన ఎస్సెస్పీ బబ్లూకుమార్ జడ్జిపై ఆగ్రా జిల్లా జడ్జి అజయ్ కుమార్ శ్రీవాస్తవకు, అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ మయాంక్ కుమార్ జైన్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు, యూపీ డీజీపీ ఓం ప్రకాశ్ సింగ్ కూడా జడ్జి తీరును తప్పుబట్టారు. పోలీసుల గౌరవ మర్యాదలకు అండగా ఉంటామన్నారు. ఎస్సెస్పీ ఫిర్యాదుపై స్పందించిన అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ మయాంక్ కుమార్ జైన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆగ్రా జడ్జిని బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.