జైలులో రాజభోగాల ఎఫెక్ట్... బళ్లారి సెంట్రల్ జైలుకు దర్శన్ తరలింపు

ఠాగూర్

గురువారం, 29 ఆగస్టు 2024 (16:09 IST)
అభిమాని రేణుక స్వామి హత్య కేసులో విచారణ ఖైదీ బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో ఉంటున్న కన్నడ హీరో దర్శన్‌కు జైలు అధికారులు లగ్జరీ సౌకర్యాలు కల్పించారు. జైలు ఆవరణలోని గార్డెన్‌లో దర్శన్ మరో ముగ్గురుతో కలిసి కుర్చీలో కూర్చుని ఒక చేతిలో గ్లాసు, మరో చేతిలో సిగరెట్ పట్టుకునివున్న ఫోటో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ ఫోటో కాస్త వైరల్ కావడంతో దర్శన్‌తో పాటు జైలు అధికారులు కూడా ఖంగుతిన్నారు. అలాగే, ఆయన జైలు నుంచే వీడియో కాల్‍‌లో మాట్లాడుతున్న వీడియో కూడా బహిర్గతమైంది. దీంతో జైలులో దర్శన్‌ రాజభోగాలు అనుభవిస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. జైలులో ఆయనకు రాచమర్యాదలు అందుతున్నాయని సోషల్ మీడియాలో కోడై కూసింది. ఈ క్రమంలో జైలు సూపరింటండెంట్‌తో పాటు మరో తొమ్మిది మంది సిబ్బందిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
 
తాజాగా ఏసీపీ తంగప్ప ఆధ్వర్యంలో భారీ బందోబస్తు మధ్య దర్శన్‌ను పరప్పణ అగ్రహార జైలు నుంచి బళ్లారి సెంట్రల్ జైలుకు తరలించారు. జైల్లో దర్శన్‌తో పాటు ఉన్న ఆయన సహచరులను కూడా వివిధ జైళ్లకు తరలించారు. మరోవైపు జైలులో దర్శన్ రాజభోగాలపై మూడు కేసులు నమోదు చేసినట్టు పోలీస్ కమిషనర్ దయానంద వెల్లడించారు. అభిమాని రేణుక స్వామి హత్య కేసులో దర్శన్ ప్రధాన నిందింతుడుగా ఉన్న విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు