అజ్మల్ కసబ్ హిందూ ఉగ్రవాదినా?... పేరు సమీర్ చౌదరి...

బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (14:31 IST)
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 26/11 దాడుల మాటెత్తితే ప్రతి ఒక్కరూ హడలిపోతారు. దేశ చరిత్రలోనే అత్యంత భయానకమైన ఉగ్రదాడిగా పేర్కొంటారు. దాదాపు పన్నేండేండ్ల కిందట దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పాకిస్థాన్‌కు చెందిన 10 మంది ఉగ్రవాదులు సాగించిన నరమేథంలో 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికిపైగా గాయపడ్డారు. 
 
అయితే ఈ దాడిని 'హిందూ ఉగ్రవాద' చర్యగా చిత్రీకరించేందుకు 'లష్కరే తాయిబా' ఉగ్రవాద సంస్థ కుట్రలు పన్నినట్లు తేలింది. ముంబై మాజీ పోలీస్‌ కమిషనర్‌ రాకేశ్‌ మారియా.. 'లెట్‌ మీ సే ఇట్‌ నౌ' పేరిట రచించిన పుస్తకంలో ఈ వివరాలు వెల్లడించారు. ఈ పుస్తకం సోమవారం విడుదలైంది. 
 
ముంబై నరమేథంపై తాను సాగించిన దర్యాప్తునకు సంబంధించి పలు ఆసక్తికర అంశాలను అందులో ప్రస్తావించారు. ఉగ్రవాదుల పేర్లను మార్చి, భారతీయ చిరునామాలపై నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించారని.. దాడుల్లో కీలకంగా వ్యవహరించిన ఉగ్రవాది మొహమ్మద్‌ అజ్మల్‌ అమీర్‌ కసబ్‌ను బెంగళూరుకు చెందిన సమీర్‌ చౌదిరిగా పేర్కొన్నారని మారియా తన పుస్తకంలో వివరించారు. 
 
'అంతా ప్రణాళిక ప్రకారం జరిగితే అతడు సమీర్‌ చౌదరిగానే మరణిస్తాడు. దీంతో మీడియా దాన్ని హిందూ ఉగ్రవాద చర్యగా భావిస్తుంది' అని లష్కరే తాయిబా కుట్ర పన్నినట్లు తెలిపారు. అంతేగాకుండా కసబ్‌ చేతికి హిందువులు ధరించే ఎర్ర రంగు కంకణం కట్టారు. దీంతో ఈ ఘటనను హిందూ టెర్రర్‌గా నమ్మించే ప్రయత్నం చేశారు. 
 
కసబ్‌ సజీవంగా పట్టుబడడంతో పోలీసులకు తమకు సంబంధించిన ఆధారాలు లభిస్తాయన్న కారణంతో పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ, లష్కరే తాయిబా అతడిని చంపే ప్రయత్నాలు కూడా చేసినట్లు మారియా వెల్లడించారు. ఈ పనిని దావూద్‌ ఇబ్రహీం గ్యాంగ్‌కు అప్పగించినట్లు తెలిపారు. 
 
ముంబై దాడులకు వెళ్లే ముందు లష్కరే తాయిబా సూత్రధారులు కసబ్‌కు రూ.1.25 లక్షలు అందజేసి, వారం రోజులు సెలవులు ఇచ్చారని చెప్పారు. ఆ నగదును అతడు తన సోదరి పెండ్లి కోసం కుటుంబ సభ్యులకు అందజేశాడని తెలిపారు. 2012 నవంబర్‌ 21న కసబ్‌ను ఉరితీసిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు