కేరళను భారీ వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేరళ ప్రజలకు ఊరట కలిగించే వార్తను వాతావరణ శాఖ తెలిపింది. మరో నాలుగైదు రోజులకు భారీ వర్షాలు కురిసే అవకాశమే లేదని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రెడ్ అలర్ట్‌ను అధికారులు ఎత్తివేశారు. అలాగే వర్షాలు తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలు కూడా ఊపందుకున్నాయి.
అయితే కోజీకోడ్, కన్నూరు, ఇడుక్కి జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. దాంతో ఈ 3 జిల్లాల్లో ఎల్లో వార్నింగ్ కంటిన్యూ చేస్తున్నారు. ఇకపోతే, కేరళ ప్రజలను ఆదుకునేందుకు ఇతర రాష్ట్రాలు చేయూతనిస్తున్నాయి. కానీ ఈ ప్రళయంలోనూ వ్యాపారులు కేరళ ప్రజలను నిలువ దోపిడీకి పాల్పడుతున్నారు.
ఇదిలా ఉంటే.. వందేళ్లలో ఎన్నడూ ఎరగని రీతిలో భారీ విపత్తు విరుచుకుపడటంతో కేరళ వాసులు నానా తంటాలు పడుతున్నారు. తినడానికి తిండి, తాగడానికి మంచినీళ్లు దొరక్క అల్లాడిపోతున్నారు. మరోపక్క నిత్యవసరాల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. పంటలన్నీ వరదలకు తుడిచి పెట్టుకుపోవడంతో కూరగాయల ధరలు విపరీతంగా పెంచేశారు.