పహల్గామ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు జడ్జీలు!!

ఠాగూర్

బుధవారం, 23 ఏప్రియల్ 2025 (14:56 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడి నుంచి కేరళ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు తృటిలో తప్పించుకున్నారు. ఈ విషయాన్ని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. కేరళ హైకోర్టుకు చెందిన జస్టిస్ అనిల్ నరేంద్రన్, జస్టిస్ పీజీ అజిత్ కుమార్, జస్టిస్ జి గిరీష్‌లతో పాటు ఎమ్మెల్యేలు ముఖేశ్, కేపీఏ మజీద్, టీ సిద్ధిక్, కె.అన్నాలన్‌ ఇటీవల జమ్మూకాశ్మీర్ ‌పర్యటనకు వెళ్లారు. 
 
వీరంతా పహల్గాం సమీపంలో ఉగ్రవాదులు జరిపిన దాడికి అతి సమీపంలోనే బస చేసివున్నారు. అయితే, అదృష్టవశాత్తూ వీరికి ఎలాంటి అపాయం జరగలేదు. ప్రస్తుతం ఈ బృందం మొత్తం శ్రీనగర్‌లో క్షేమంగా ఉందని, వారిని సురక్షితంగా కేరళ తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది. 
 
అయితే, దురదృష్టవశాత్తు ఉగ్రదాడిలో కేరళ రాష్ట్రంలోని కొచ్చి ఎడవల్లికి చెందిన పర్యాటకుడు ఎన్.రామచంద్రన్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రామచంద్రన్ మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం.. మృతుడు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, వారిని సురక్షితంగా స్వస్థలానికి చేర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. పహల్గాం సమీపంలోని బైసరన్ లోయ వద్ద సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులే లక్ష్యంగా పైశాచిక దాడికి తెగబడిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు