బిపోర్‌జాయ్ ముప్పు - కచ్‌, సౌరాష్ట్ర తీరాలకు ఆరెంజ్‌ అలర్ట్‌.. సముద్రం ఉగ్రరూపం

సోమవారం, 12 జూన్ 2023 (19:59 IST)
బిపోర్‌జాయ్‌ తుఫాను గుజరాత్‌ రాష్ట్రంలోని కచ్‌, పాకిస్థాన్‌లోని కరాచీల మధ్య ఈ నెల 15వ తేదీన తీరాన్ని దాటనుందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. దీంతో గుజరాత్‌లోని, కచ్‌ తీరాలకు ఐఎండీ ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేసింది. కచ్‌లో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ముందుజాగ్రత్త చర్యగా తాత్కాలిక శిబిరాలకు తరలిస్తున్నారు. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 135-150 కి.మీల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
 
ఇప్పటికే గుజరాత్‌లో దక్షిణ, ఉత్తర తీరాల్లో మత్స్య సంబంధిత కార్యకలాపాలను నిలిపివేశారు. అటు ద్వారకలోనూ 1300 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గుజరాత్‌లోని కచ్‌, జామ్‌నగర్‌, మోర్బి, గిర్‌ సోమనాథ్‌, పోర్‌బందర్‌, ద్వారక జిల్లాలో వచ్చే రెండు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు దేశ వాణిజ్య రాజధాని ముంబైకి కూడా వర్షాల ముప్పు పొంచి ఉంది. దీంతో ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. 
 
మరోవైపు, అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్‌ తుఫాను అతితీవ్ర తుఫానుగా మారడంతో తీర రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. అటు కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై దృష్టిసారించింది. తుఫాను పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం కీలక సమీక్ష నిర్వహించారు. తాజా పరిస్థితి, ముందస్తు సహాయక చర్యల ఏర్పాట్లపై ప్రధాని సమీక్షించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు