తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఆ పార్టీకి చెందిన మాజీ నేత, ప్రస్తుత బీజేపీ నేత సువేందు అధికారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 66 ఏళ్ల ఆంటీ అని, ఆమెకు ఓట్లు వేయడం ఎందుకని ప్రశ్నించారు.
కాగా, ప్రస్తుతం జరుగుతున్న బెంగాల్ ఎన్నికల్లో నందీగ్రామ్ నియోజకవర్గంలో ఇద్దరూ పోటీపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల బీజేపీపై తీవ్ర స్థాయిలో మమతా బెనర్జీ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో మాజీ టీఎంసీ నేత అయిన సువేందు అధికారి.. బెంగాల్ సీఎంను ఆంటీ అంటూ సంబోధించారు.
దీదీ వాడుతున్న భాష సరిగా లేదని, ఆమె ఆ భాషను మానుకోవాలన్నారు. మే 2వ తేదీన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలుబడుతాయని, ఆ తర్వాత కూడా కేంద్ర బలగాలు రాష్ట్రంలోనే ఉండాలని సువేందు తెలిపారు. ఇవాళ జరుగుతున్న రెండవ దశ పోలింగ్‌లో నందీగ్రామ్ కూడా ఉన్నది.
మమతా బెనర్జీ బెంగాల్ సీఎం అని, ఆమె తన నోటిని అదుపులో పెట్టుకోవాలని, ప్రధాని మోడీపై అభ్యంతరకర రీతిలో భాషను వాడుతున్నారని, దీదీ 66 ఏళ్ల ఆంటీ అంటూ సువేందు ఆరోపించారు. ఎన్నికల నియమావళిని ఉల్లఘించి దీదీ మీడియాతో మాట్లాడినట్లు సువేందు పేర్కొన్నారు.
ఓటర్లను ఆకర్షించేందుకు దీదీ చేస్తున్న ప్రయాత్నాలను విఫలం అవుతాయన్నారు. ఎక్కడ రీపోలింగ్ జరవగవద్దు అని, ఎటువంటి హింస చోటుచేసుకోవద్దు అని ఆశిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ యాక్టివ్‌గా ఉన్నారని, కేంద్ర బలగాలు ఇక్కడే ఉన్నాయని, 14 డ్రోన్లను వాడుతున్నామని, 76 బూతుల్లో క్విక్ రెస్పాన్స్ దళాలు ఉన్నాయని, శాంతియుత వాతావరణం ఉండడం సంతోషంగా ఉందని, ప్రజలే తమ నిర్ణయం తీసుకుంటారని సువేందు తెలిపారు.