తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఒడిశాలోని బెల్పాడా పోలీస్స్టేషన్ పరిధి సులేకేలా గ్రామానికి చెందిన మైనర్ (17) బొలంగిర్కు చెందిన యువతితో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. అనంతరం ఇరు కుటుంబాలను ఒప్పించి వారు పెళ్లి చేసుకున్నారు.
పెళ్లైన రెండు నెలల తర్వాత ఆర్థిక సమస్యలున్నాయని, ఇటుకల బట్టీలో పనిచేద్దామని చెప్పి భార్యను రాయ్పూర్ తీసుకెళ్లాడు. ఆ తర్వాత అక్కడి నుంచి రాజస్థాన్లోని ఓ గ్రామానికి తీసుకెళ్లాడు. అక్కడ ఓ 55 ఏళ్ల వ్యక్తి రూ.1.8 లక్షలకు భార్యను అమ్మేసి అతడి ఇంట్లో వదిలేసి వచ్చాడు.
ఆ డబ్బుతో విలాసవంతమైన హోటల్లో భోజనం చేసి, ఖరీదైన స్మార్ట్ఫోన్ కొనుగోలు చేశాడు. అనంతరం యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆమె వేరే వ్యక్తితో పారిపోయిందని నమ్మబలికాడు. అయితే, అతడిపై అనుమానం వచ్చిన బాధితురాలి కుటుంబ సభ్యులు బెల్పాడా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు యువతి రాజస్థాన్లోని ఓ గ్రామంలో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు అక్కడికి చేరుకోగా వారికి గ్రామస్థుల నుంచి తిరుగుబాటు ఎదురైంది. రోడ్లను బ్లాక్ చేసి వారిని అడ్డుకున్నారు. అతికష్టమ్మీద రాజస్థాన్ పోలీసుల సాయంతో ఆ యువతిని కాపాడి ఒడిశా పోలీసులు ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. పరారీలో ఉన్న వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.