ఆ భర్త అన్నంతపనీ చేశాడు.. అవకాశం చిక్కితే నీ ముక్కును కొరుక్కుని తినేస్తానే అంటూ పదేపదే భార్యతో అంటుండేవాడు. ఇపుడు ఆ పనీ చేసేశాడు. భార్య ముక్కు అందంగా ఉండటాన్ని భర్త జీర్ణించుకోలేకపోయాడు. ముక్కును ముద్దాడుతూనే చటుక్కున కొరికేశాడు. ఈ దారుణ వెస్ట్ బెంగాల్‌లోని నదియా జిల్లాలో జరిగింది. శాంతిపూర్ పోలీస్ స్టేషన్ పరిధలోని బైర్బారా ప్రాంతంలో భర్త బాపన్ షేక్‌తో కలిసి మధు ఖాతూన్ అనే మహిళ ఉంటోంది.
ఈ నెల 2వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు బాపన్ షేక్ ఇంట్లో ఒక్కసారిగా అలజడి ేగింది. మధు ఖాతూన్ అరుపులు, కేకలు మార్మోగాయి. ఆమె ముక్కు, వేలు నుంచి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఈ దారుణంపై తన తల్లితో కలిసి శాంతిపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అవకాశం దొరికితే ముక్కును కొరికి తినేస్తానని నా భర్త అపుడపుడూ అంటుండేవాడనీ, ఇపుడు అన్నంతపని చేశాడంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.