అవయవ దానం చేసిన నవజాత శిశువు

శుక్రవారం, 20 అక్టోబరు 2023 (16:17 IST)
సూరత్‌లో ఓ నవజాత శిశువు అవయవ దానం చేయడం చర్చకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. అక్టోబరు 13న సూరత్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అమ్రేలికి చెందిన ఓ మహిళ మగబిడ్డను ప్రసవించింది. అయితే, ఆ శిశువులో ఎటువంటి కదలికలు లేకపోవడంతో వైద్యులు బ్రెయిన్ డెడ్‌తో మరణించినట్లు ధ్రువీకరించారు. 
 
ఈ విషయం తెలుసుకున్న స్వచ్ఛంద సంస్థ జీవన్‌దీప్‌ ఆర్గాన్‌ డొనేషన్‌ ఫౌండేషన్‌ (జేఓడీఎఫ్‌) మేనేజింగ్‌ ట్రస్టీ విపుల్‌ తలావియా.. శిశువు తల్లిదండ్రులను కలిసి.. అవయవదానం ప్రాధాన్యతను వారికి వివరించారు. దీంతో ఆ చిన్నారి అవయవాలను దానం చేయడానికి తల్లిదండ్రులు సమ్మతించారు. 
 
దేశంలో అత్యంత పిన్న వయసు అవయవదాతగా ఈ పసికందును చెబుతున్నారు. నవజాత శిశువు నుంచి రెండు కిడ్నీలు, రెండు కార్నియాలు, కాలేయం, ప్లీహాన్ని సేకరించారు. 
 
కార్నియాను సూరత్ ఐ బ్యాంకుకు..మూత్రపిండాలను అహ్మదాబాద్‌లోని కిడ్నీ రిసెర్చ్ సెంటర్‌కు, కాలేయాన్ని ఢిల్లీలోని లివర్ బైలరీ సైన్సెస్ ల్యాబొరేటరీకి తరలించారు. 
 
అనంతరం తొమ్మిది నెలల చిన్నారికి కాలేయాన్ని విజయవంతంగా అమర్చారు. కిడ్నీలను 13 ఏళ్లు, 15 ఏళ్ల చిన్నారులు ఇద్దరికి అమర్చి.. కొత్త జీవితాన్ని ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు