కేంద్ర మంత్రివర్గ విస్తరణ వాయిదా... విజయసాయిరెడ్డికి మొండిచేయి?

సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (09:59 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మంత్రివర్గం విస్తరణను ఏప్రిల్ నెలకు వాయిదావేసుకున్నారు. మార్చి నెలలో రాజ్యసభ ఎన్నికల తర్వాతే తన మంత్రివర్గాన్ని విస్తరించాలని ఆయన భావిస్తున్నారు. అంతేకాకుండా, ఈ మంత్రివర్గంలో ఏపీ నుంచి వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అవకాశం కల్పిస్తారంటూ ప్రచారం సాగింది. కానీ, ఆయనకు మోడీ మొండిచేయి చూపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ఎందుకంటే.. ఆయన స్థానంలో షాంఘైలో న్యూ డెవల్‌పమెంట్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌, ప్రముఖ పారిశ్రామికవేత్త కె.వి.కామత్‌, సీనియర్‌ జర్నలిస్టు స్వపన్‌దాస్‌ గుప్తాలను చోటు కల్పించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే, రాజ్యసభలో సభ్యులుగా ఉంటా మంత్రులుగా పని చేస్తున్న వారిలో పలువురి పదవీకాలం త్వరలో ముగియనుంది. దీంతో వారికి మళ్లీ ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభకు నామినేట్ చేయాలని మోడీ భావిస్తున్నారు. 
 
పైగా, పార్టీలో పలువురు నేతలను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ప్రధాని మోడీ భావిస్తున్నారు. ఈ కారణంగానే విజయసాయిరెడ్డిని దూరంగా ఉంచాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా, విజయసాయిరెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటే బీజేపీకి చెడ్డపేరు వస్తుందని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. 
 
ఎన్నో అవినీతి కేసులు ఎదుర్కొంటూ, జగన్ అక్రమాస్తుల కేసులో ఏ-2 నిందితుడుగా ఉంటూ బెయిల్‌పై ఉంటున్న ఓ వ్యక్తికి తన మంత్రివర్గంలో చోటుకల్పించడం వల్ల చెడు సంకేతాలు పంపినట్టు అవతుందని ఆయన భావిస్తున్నారు. అందుకే వైకాపాకు చెందిన వారికి మంత్రివర్గంలో చోటు కల్పించరాదని ప్రధాని మోడీ భావిస్తున్నట్టు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు