పుట్టగొడుగుల బిర్యానీ రుచికి రాహుల్ ఫిదా ... గ్రామీణులతో కలిసి నేలపై కూర్చొని...

శనివారం, 30 జనవరి 2021 (17:47 IST)
తమిళ వంటలకు కాంగ్రెస్ పూర్వ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా, పుట్టగొడుగల బిర్యానీని రూచిచూశారు. ఈ బిర్యానీ రుచి సూబర్బ్ అంటూ కితాబిచ్చారు. 
 
తమిళనాట పాపులర్ యూట్యూబ్ ఛానల్ ‘విలేజ్ కుకింగ్ ఛానల్’ తయారు చేసిన ఈ వంటకాన్ని రాహుల్ ప్రశంసించారు. ఈ కుకింగ్ ఛానల్‌ను రైతులు స్వయంగా నిర్వహిస్తుండటం విశేషం. 
 
గ్రామీణ వంటకాల రుచులను ప్రపంచానికి తెలియజేస్తూ.. తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పుదుకొట్టై జిల్లాలోని చిన్న వీరమంగళం గ్రామానికి చెందిన వీరు నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానల్‌కు పెద్ద ఎత్తున సబ్ స్క్రైబర్లు ఉన్నారు. 
 
యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకు వీళ్లు వినియోగిస్తున్నారు. ఇదే రాహుల్‌ను వారి దగ్గరకు వెళ్లేలా చేసింది. ఇదిలావుంటే, పుట్టగొడుగుల బిర్యానీ రుచిని రాహుల్ ఆస్వాదించారు. వారితో పాటు కలిసి నేలపై కూర్చుని బిర్యానిని ఆరగించారు. 
 
ఈ సందర్భంగా రాహుల్‌కు, వారి మధ్య ఆసక్తికర సంభాషణ నడిచింది. ‘మీ లక్ష్యమేంటి’ అని రాహుల్ అడగగా.. విదేశాల్లోనూ తమ వంటలను చేయాలనకుంటున్నట్టు వాళ్లు తెలిపారు. ‘ఎక్కడెక్కడా?’ అని రాహుల్ అడిగారు. అమెరికా, మలేషియా, చైనా తదితర దేశాల పేర్లు చెప్పారు.
 
అయితే అమెరికాలో ఎక్కడికి వెళతారు అనగా... దానిపై స్పష్టత లేదన్నారు. వెంటనే రాహుల్ .. అమెరికాలో ఉన్న తన స్నేహితుడు శ్యామ్ పిట్రోడాకు వీరి గురించి చెబుతానని.. అక్కడికి వెళ్లొచ్చని తెలిపారు. దీంతో వారి ఆనందానికి హద్దులు లేవు. 
 
14 నిమిషాల నిడివిగల ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పుట్టగొడుగుల బిర్యానీ రుచి చూడటమేగాక, వంటకం తయారీలో రాహుల్ కూడా ఓ చేయి వేశారు. కరూర్ పట్టణ శివారులో జనవరి 25న ఈ షూటింగ్ జరిగింది. 
 
తమిళనాడులో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఇటీవల రాహుల్ ఇక్కడికి వచ్చారు. ఆయనతో పాటు కరూర్ కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి కూడా ఉన్నారు. రాహుల్ రాకతో ఈ విలేజ్ కుకింగ్ చెఫ్స్ మురిసిపోయారు. బృందంలో ఉన్న ఓ పెద్దాయన రాహుల్ నాయనమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీని తలుచుకుని ఉద్వేగానికి గురయ్యారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు