గోప్యతపై తీర్పు వెలువరించిన ధర్మాసనంలో సీజేఐ జగ్దీష్ సింగ్ ఖేహర్, న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, జే చలమేశ్వర్, రోహింటన్ నారీమన్, ఆర్కే అగర్వాల్, సంజయ్ కిషన్ కౌల్, ఎస్‌ఏ బొబ్డే, ఎస్ అబ్దుల్ నజీర్, ఏఎమ్ సప్రేలు ఉన్నారు. మూడు వారాల్లో ఆరు రోజుల పాటు వాదనలు విన్న ధర్మాసనం ఆగష్టు 2న తీర్పును రిజర్వు చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఆధార్ కార్డు ఆధారంగా ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. ఆధార్ కార్డు వ్యక్తిగత వివరాలను తెలుపుతుంది కనుక సుప్రీం కోర్టు తీర్పుతో ఇకపై ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డును జతచేయాలా? లేదా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ పీటముడిపై సంగ్ధితను తొలగించేందుకు ఐదుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గోప్యత అనే ప్రాథమిక హక్కును ఆధార్ కార్డు ఉల్లంఘిస్తుందా? అనే దానిపై విచారణ జరిపి తీర్పు చెప్పనుంది.
దీనిపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందిస్తూ.. 9 మంది సభ్యులతో కూడిన ధర్మాసనం ఏకగ్రీవంగా ఇచ్చిన తీర్పు కేంద్రప్రభుత్వానికి శరాఘాతమేనని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ప్రాథమిక హక్కులను కాలరాసే హక్కు పార్లమెంటుకు లేదని ధర్మాసనం స్పష్టం చేయడం కేంద్ర ప్రభుత్వాన్ని షాక్‌కు గురి చేస్తుందన్నారు.