మొబైల్ నంబర్‌తోపాటు ఇతర సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం చేయడాన్ని సవాలు చేసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. సమాఖ్య వ్యవస్థలో పార్లమెంట్ చేసిన చట్టాన్ని ఓ రాష్ట్రం ఎలా ప్రశ్నిస్తుందంటూ బెంగాల్ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది సుప్రీంకోర్టు. నిజానికి ఇది పరిశీలించాల్సిన అంశమే అయినా.. ఓ రాష్ట్రం ఎలా సవాల్ చేస్తుందో వివరించాలని సుప్రీంకోర్టు విచారణ కోరింది.
'మీ క్లయింట్‌ను వ్యక్తిగతంగా రమ్మనండి.. మమతా బెనర్జీ ఓ వ్యక్తిగా పిటీషన్ దాఖలు చేయమని చెప్పండి, అపుడు పరిశీలిస్తాం అంటూ వెస్ట్ బెంగాల్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్‌కు సుప్రీం ధర్మాసనం సూచన చేసింది. ఈ అంశంలో ఏకే సిక్రీ, అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం బెంగాల్ ప్రభుత్వ తీరును తప్పుబట్టింది.
ఇటీవల పలు సంక్షేమ పథకాలకు ఆధార్‌ను అనుసంధానిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతేగాక బ్యాంకు ఖాతాలు, మొబైల్ నంబర్లకు ఆధార్ తప్పనిసరి అని పేర్కొంది. అయితే దీనిపై సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ్‌బంగా ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెల్సిందే.