ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై ఉత్తరప్రదేశ్‌లో కాల్పులు జరిగాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల కార్యక్రమం ముగించుకుని తిరిగి ఢిల్లీ వెళ్తుండగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో అసదుద్ధీన్ ఓవైసీ సురక్షితంగా బయటపడ్డారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు.
ఇంకా దీనిపై అసదుద్ధీన్ స్వయంగా స్పందించారు. "మీరట్‌లోని కితౌర్‌లో ఎన్నికల సంబంధిత కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఢిల్లీకి వెళ్తున్నాను.. కానీ, ఛిజర్సీ టోల్ పాజా వద్ద తన కారుపై కాల్పులు జరిపినట్టు" సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు అసదుద్దీన్ ఒవైసీ.
తన కారుకు బుల్లెట్లు తగిలిన ఫొటోను కూడా ఆయన షేర్ చేశారు. తన కారు పంక్చర్ కావడంతో, మరో కారులో తాను ఢిల్లీకి చేరుకున్నానని ఈ ఘటనలో ఎవ్వరికీ ఏమీ కాలేదని.. అందరూ క్షేమంగా ఉన్నారని ట్వీట్ చేశారు.
ఆయా స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపి.. ప్రచారానికి స్వయంగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వెళుతున్నారు. ఇప్పటికే ఎంఐఎం బరేలీ, సహరన్‌పూర్ దేహత్, భోజ్‌పూర్, రుదౌలి, లోనీ, హస్తినపూర్, రిజర్వ్‌డ్ నియోజకవర్గం, మీరట్ సిటీ, రాంనగర్, నాంపారా వంటి స్థానాల నుంచి 27 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. రానున్న రోజుల్లో మరికొంత మంది అభ్యర్థులను ప్రకటిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు.