మహిళపై పగబట్టిన పాము, ఆరేళ్లుగా అదను చూసి కాటు

ఐవీఆర్

మంగళవారం, 21 మే 2024 (14:09 IST)
పాములు పగపడతాయా? ఏళ్లకు ఏళ్లయినా వదలకుండా వెంటాడుతాయా? అంటే అవునని అంటున్నారు ఆ రాష్ట్రంలోని గ్రామవాసులు. పూర్తి వివరాలను చూస్తే... మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కట్ని జిల్లా బహరోబంద్ పరిధిలోని గుణబచ్చయ్య గ్రామంలో ఓ కుటుంబంలోని మహిళపై పాము పగబట్టిందట. మే 10వ తారీఖును ఆమె ఇంట్లో పని చేసుకుంటుండగా త్రాచుపాము కాటు వేసింది. ఈ విషయాన్ని వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఆమెను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఐతే సదరు మహిళను పాము కాటు వేయడం ఇదే మొదటిసారి కాదని చెబుతున్నారు కుటుంబ సభ్యులు.
 
గత ఆరేళ్లుగా ఆమెను అదను చూసి పాము కాటు వేస్తోందనీ, ఆసుపత్రికి తరలించి ప్రాణాలను కాపాడుకుంటున్నట్లు చెప్పారు. ఆ పాము మహిళపై ఎందుకు పగ పట్టిందో తెలియడం లేదని వాపోతున్నారు. మరోవైపు మహిళను కాటు వేసిన పాము ఒక్కటేనా లేదంటే అనేక పాములు ఒక్కోసారి కాటు వేసాయా అనే విషయంపై ఆ గ్రామ వాసులు చర్చించుకుంటున్నారు. మొత్తమ్మీద సదరు మహిళ మాత్రం తనను పాము ఎప్పుడు కాటు వేస్తుందో అని భయంతో వణికిపోతుందట.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు