బాగా చదువుకుని డాక్టర్లు అవుతారనుకున్న ఆ ఎంబీబీఎస్ విద్యార్థుల తల్లిదండ్రులకు షాక్ తప్పలేదు. డాక్టర్లు కావాల్సిన తమ బిడ్డలు తిరిగి రాని లోకాలకు చేరిపోయారనే వార్త వారికి విషాదాన్ని మిగిల్చింది. తాజాగా ఇద్దరు ఎంబీబీఎస్ విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. చదువులో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోలేక ఒకరు ఆత్మహత్యకు పాల్పడగా, బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేయలేననే ఆందోళనలో మరొక విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది.
వివరాల్లోకి వెళితే.. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌కు చెందిన విస్మాద్‌సింగ్ (20) నగరంలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల ప్రాంగణంలోని హాస్టల్ ఆరో అంతస్థు నుంచి పదో అంతస్థుకు వెళ్లి, అక్కడి నుంచి కిందకు దూకేశాడు. ఇది చూసిన సిబ్బంది వెంటనే కళాశాలకు చెందిన ఆస్పత్రికి తరలించారు. అయితే తలకు బలమైన గాయమవ్వడంతో అప్పటికే మృతిచెందాడు.
చదువు ఒత్తిడి తట్టుకోలేక, లోకం విడిచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్టు పంజాబీ భాషలో రాసిన లేఖ హాస్టల్‌లోని అతడి గదిలో లభించినట్టు ఎస్‌ఐ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
అలాగే అనకాపల్లి జిల్లా మాకవరపాలేనికి చెందిన చింతల దేవుడు, గౌరి దంపతుల కుమార్తె శివాని జ్యోత్స్న(21) కూడా ఆత్మహత్యకు పాల్పడింది. జ్యోత్స్న అనకాపల్లి శివారు ప్రాంతంలో గల కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
ప్రథమ సంవత్సరంలో బ్యాగ్‌లాగ్స్ ఉండిపోయాయి. వాటిని క్లియర్ చేయడంలో భాగంగా చదువుకునేందుకు ఈనెల 15న సుజాతనగర్‌లోని ఓ అపార్టుమెంటులో నివసిస్తున్న తన మేనమామ ఇంటికి వచ్చింది. అక్కడ ముభావంగా వుంటూ బ్యాక్‌ల్యాగ్స్ గురించి ఆలోచిస్తూ.. ఒత్తిడికి గురైంది.
ఈ క్రమంలో బుధవారం రాత్రి ఏడు గంటలకు చదువుకుంటానంటూ అపార్ట్‌మెంట్ టెర్రస్ ఎక్కింది. కొంతసేపటి తరువాత టెర్రస్ మీద నుంచి కిందకు దూకేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జ్యోత్స్నను స్థానికులు, బంధువులు ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే పెందుర్తి సీహెచ్‌సీకి తరలించగా పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ మేరకు పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.