విజయదశమి పండుగను పురస్కరించుకుని జైలులో రామ్ లీలా నాటకాన్ని ప్రదర్శించారు. ఇందులో ఇద్దరు ఖైదీలు వానరులుగా నటించారు. వీరిద్దరూ సీత కోసం గాలిస్తున్నట్టుగా నాటకమాడి జైలు నుంచి గుట్టుచప్పుడు కాకుండా అక్కడ నుంచి పారిపోయారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ పట్టణంలోని రోష్నాబాద్ జైలులో జరిగింది. ఈ నాటకంలో వానరాలుగా వేషం చేసిన పంకజ్, రాజ్ కుమార్ అనే ఇద్దరు ఖైదీలు పారిపోయారని, వారి కోసం గాలిస్తున్నట్టు జైలు అధికారులు వెల్లడించారు.
ఈ వివరాలను పరిశీలిస్తే, హరిద్వార్ పట్టణంలోని రోష్నాబాద్ జైలు రామ్ లీలా నాటకాని ప్రదర్శించారు. ఈ నాటకం రసవత్తరంగా సాగుతుండడం, జైలు అధికారులు, సిబ్బంది, గార్డులంతా నాటకం చూడడంలో మునిగిపోవడంతో ఇదే అదునుగా భావించిన వానర వేషంలో ఉన్న ఇద్దరు ఖైదీలు నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుని నిచ్చెన ద్వారా గోడ దూకి పరారయ్యారు.