స్వాతంత్ర్యం వచ్చిన 73 యేళ్ళ తర్వాత భారత పౌరులుగా నిరూపించుకోవాలా?

శుక్రవారం, 20 డిశెంబరు 2019 (09:33 IST)
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (క్యాబ్)పై వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 73 యేళ్లు అయిందనీ, ఇపుడు భారత పౌరులు అని నిరూపించుకోవాలా అంటూ ఆమె కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు.
 
అంతేకాకుండా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (బీజేపీ)కి దమ్ముంటే పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్‌సీ)లపై ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని సవాల్ విసిరారు. ఈ ఓటింగ్‌లో కనుక బీజేపీ ఓటమిపాలైతే గద్దె దిగిపోవాలన్నారు. 
 
కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా మమత వరుసగా మూడో రోజు గురువారం కోల్‌కతాలో నిర్వహించిన నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. బీజేపీకి మెజారిటీ ఉన్నంత మాత్రాన నచ్చింది చేస్తామంటే కుదరదని తేల్చిచెప్పారు. 
 
సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనలను హిందూ, ముస్లింల మధ్య పోరాటంగా ఏమార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆమె ఆరోపించారు. నేరస్థులు, అవినీతిపరులను సాధువులుగా మార్చేందుకు బీజేపీ ఓ వాషింగ్ మెషిన్‌గా పనిచేస్తున్నదని మమత మండిపడ్డారు.
 
పైగా, నిరసనల ముసుగులో బీజేపీ కార్యకర్తలే ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని మమత ఆరోపించారు. ఎన్ఆర్‌సీ విషయంలో జరుగుతున్న అవాస్తవ ప్రచారాన్ని నమ్మొద్దని మమత విజ్ఞప్తిచేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు