యూపీలో పదుల సంఖ్యలో కోతులు మరణించాయి. మధుర జిల్లా అన్యూర్ గ్రామంలో ఉక్రెయిన్ వాసుడు స్థానికుడితో కలిసి.. పదుల సంఖ్యలో కోతుల్ని హతమార్చాడు. ఎయిర్‌గన్‌తో ఈ దారుణానికి పాల్పడగా 60 కోతులు చనిపోగా మరిన్ని గాయపడ్డాయి. స్థానికుడు జానకీ దాస్, నిందితుడు బ్రజ్ సుందర్ దాస్ (ఉక్రేనియన్ జాతీయుడు) అదుపులోకి తీసుకున్నట్లు గోవర్ధన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) రవి త్యాగి తెలిపారు.
ఈ సంఘటన గురించి స్థానికులు సమాచారం అందించగానే ఘటన స్థలానికి చేరుకున్న గోవర్ధన్ పోలీసులు.. స్థానిక పశువైద్యశాల బృందాన్ని పిలిపించారు. చనిపోయిన కోతులను పోస్ట్‌మార్టం కోసం పంపించి, గాయపడిన జంతువులకు చికిత్స చేశారు. ఈ జీవహింసపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.