కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ చట్టం వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఆందోళనకు దారితీసింది. ఈ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అనేక మంది ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. వక్ఫ్ చట్టాన్ని అమలు చేయబోమని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు.
మతం అంటే మానవత్వం. నాగరికత. సామరస్యం అని నా భావన. శాంతి, సామరస్యాన్ని కాపాడుకోవాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. ఇక మీరంతా వ్యతిరేకిస్తున్న వక్ఫ్ చట్టాన్ని రూపొందించింది మేము కాదు. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వం. మీకు కావాల్సిన సమాధానాలు అడగాల్సింది కేంద్రాన్ని. ఆ చట్టాన్ని బెంగాల్ రాష్ట్రంలో అమలు చేయబోం" అని ఆమె స్పష్టం చేశారు.
ఇదిలావుంటే, వక్ఫ్ చట్టం మంగళవారం నుంచి దేశంలో అమల్లోకి వచ్చిందంటూ కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నేపథ్యంలో శనివారం వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని మాల్డా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. రోడ్లను దిగ్బంధించారు. వారిని ఆపడానికి ప్రయత్నించిన భద్రతా బలగాలపై కూడా దాడులకు తెగబడ్డారు. దీంతో 110 మందికిపై నిరసనకారులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.