మా భార్యలు తెగ తాగేస్తున్నారు... పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్తలు!!

ఠాగూర్

గురువారం, 13 మార్చి 2025 (08:39 IST)
మా భార్యలు తెగ తాగేస్తున్నారంటూ పలువురు భర్తలు వాపోతున్నారు. ఇదే అంశంపై వారు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. మద్యానికి బానిసైన తమ ఆడవాళ్లు ఇంటిని గుల్ల చేస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని లబోదిబోమంటున్నారు. ఇది కాస్త వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది పచ్చి నిజం. ఒరిస్సా రాష్ట్రంలోని కోరాట్‌పుట్ జిల్లా బరిగుమ్మ సమితిలోని పూజారిపుట్ పంచాయతీ కొండగూడ గ్రామంలో జరిగిందీ ఘటన. గ్రామంలోని పురుషులందరూ బుధవారం పోలీసులు, ఆబ్కారీ అధికారులను కలిసి తమ బాధను మొరపెట్టుకున్నారు. 
 
గ్రామంలోని కొందరు యువకులు సారా తయారు చేసి విక్రయిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. తాము కూలి చేసి డబ్బులు సంపాదించి తెస్తుంటే తమ భార్యలు మాత్రం మద్యానికి బానిసై ఇల్లు గుల్ల చేస్తున్నారని, డబ్బులు మొత్తం మద్యానికే ధారబోస్తున్నారని వాపోయారు. ఇలాగైతే సంసారాలు గడవడం కష్టమని, పిల్లలు బతుకు అంధకారమైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సారా తయారీదారులపై చర్యలు తీసుకుని తమ కుటుంబాలను, గ్రామాన్ని రక్షించాలని వేడుకున్నారు. వారి ఫిర్యాదును స్వీకరించిన అధికారులు తగిన చర్యలకు సిద్ధమవుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు