ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ కేవలం మూడు రోజుల్లోనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా.. మహిళలను వేధించేవారి అకతాయిల భరతం పట్టేందుకు యాంటీ రోమియో స్క్వాడ్‌ను ఏర్పాటు చేయాలని డీజీపీని ఆదేశించారు. ఆ వెంటనే ఈ స్క్వాడ్‌లు ఏర్పాటు చేయడం, పలువురిని అరెస్టు చేయడం జరిగిపోయింది.
మరోవైపు ప్రభుత్వ ఆఫీసుల్లో గుట్కా నమిలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోవుల స్మగ్లింగ్‌పై నిషేధాన్ని అత్యంత కఠినంగా అమలు చేయాలని, ఈ విషయంలో ఏమాత్రం ఉపేక్ష పనికిరాదని ఆదిత్యనాథ్ స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా గోవధశాలల మూసివేతకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
కాగా, మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం యోగి, హోం శాఖను తన వద్దే అట్టేపెట్టుకున్నారు. తద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతలను తానే స్వయంగా పర్యవేక్షించనున్నారు. అలాగే, మైనింగ్ మాఫియాను అరికట్టేందుకు కూడా ఆ శాఖను ఎవరికీ కేటాయించకుండా తనవద్దే ఉంచుకున్నారు.