తత్వా(తెలుగు అసోసియేషన్ ఆఫ్ ట్రైవ్యాలీ) వారు అగోరా హిల్స్ పట్టణం, కాలిఫోర్నియాలో డిశంబరు 2018లో నిర్వహించిన జల్సా(సంబరాల సందడి) కార్యక్రమంలో 400 మందికి పైగా ప్రవాసాంధ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానాంశంగా ఇటీవల దక్షిణ కాలిఫోర్నియాలో కల్లోలం సృష్టించిన దావానలంలో తమ ప్రాణాలొడ్డి అత్యంత ధైర్య సాహసాలతో పోరాడి ప్రాణనష్టం మరియు ఆస్తినష్టం కలుగకుండా ఆపిన వెంచురా కౌంటి అగ్నిమాపక దళం సిబ్బందికి కృతజ్ఞతాభివందనలు తెలిపి, ఉడుతాభక్తిగా తత్వా సేకరించిన నిధులను సమర్పించారు.
అగ్నిమాపక దళం సిబ్బంది ప్రతినిధులుగా విచ్చేసిన డేవిడ్, మైఖేల్ మరియు రయన్ ప్రసంగిస్తూ... ఇటువంటి గుర్తింపు తమకు ఎంతో ఆత్మబలాన్నిస్తుందనీ, మరింత ప్రేరణతో తమ విధులను నిర్వర్తించేలా చేస్తుందని అన్నారు. తత్వా నిర్వహించే సంఘ సేవా కార్యక్రమాలు భావితరాలకు మంచి ఉదాహరణలుగా మరియు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అన్నారు.
ముందుగా బాలబాలికలు గణేశుని ప్రార్థనతో సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. తరువాత సుమారు 90 నిషాల పాటు 5 నుండి 17 సంవత్సరాల బాలబాలికలు తమ గాన, నృత్య మరియు నాటక ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. మహిళామణులు సైతం తామేమీ తీసిపోమన్నట్లుగా తమ నాట్యంతో విచ్చేసిన ప్రేక్షకులందరినీ అలరించారు. ముఖ్యంగా చిన్నారులు తమంత తాముగా కూర్చుని ప్రదర్శించిన నృత్యరూపకాలు మోహినీ భస్మాసుర, మరియు శివతాండవం, పౌరాణిక నాటిక దానవీరశూరకర్ణ ప్రేక్షకులను సమ్మోహితులను చేశాయి.
గ్రాండ్ బావర్చీ వారందించిన రుచికరమైన సంపూర్ణ విందు భజనాన్ని అందరూ ఆనందంగా ఆరంగించారు. చివరిగా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆహుతులకు, ప్రదర్శకులకు, వాలంటీర్లకు మరియు స్పాన్సర్లకు తత్వా కార్యనిర్వాహక వర్గ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. విచ్చేసినవారంతా తత్వా ముఖ్య ఉద్దేశ్యాలైన, మాసవారీ ఆరోగ్య కార్యక్రమాలు, సంఘసేవా కార్యక్రమాలు, చిన్నారులలోని ప్రతిభకు వేదికనిచ్చేలా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు అందరికీ ఉపయోగదాయకాలని ఆనందాన్ని వ్యక్తం చేశారు.