అక్షయ తృతీయ రోజున పెరుగన్నం దానం చేస్తే..?

సోమవారం, 3 మే 2021 (20:13 IST)
అక్షయ తృతీయ రోజున పెరుగన్నం దానం చేయడం అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అలాగే శెనగలు, గొడుగులు, భూమి, బంగారం, వస్త్రాలు దానం చేయడం ఫలప్రదం. ఉపాధులు కోల్పోయిన వారికి సాయం చేయడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. అక్షయ తృతీయ రోజున పరశురాముని జన్మదినం.. అలాగే పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం. త్రేతాయుగం మొదలైన దినమని ఆధ్యాత్మిక పండితులు వెల్లడించారు.
 
ఇంకా శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో, వ్రాయడం మొదలుపెట్టిన దినం. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం.
 
శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం. ఆదిశంకరులు"కనకధారాస్తవం"ను చెప్పిన దినం. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినమని పండితులు చెప్తున్నారు. 
 
అక్షయ తృతీయ రోజు ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు లక్ష్మీదేవి, శ్రీమహా విష్ణువును పూజించాలి. ఆవునెయ్యితో దీపారాధన, పాయసం, పొంగలి, రవ్వకేసరి వంటి పదార్థాలను లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టాలి. 
 
అంతేకాదు మీ ఇంటి ఆవరణలో కానీ, మీ వ్యవసాయ క్షేత్రంలో కానీ ఈ రోజున విత్తనాలు చల్లాలి లేదా ఒక మొక్క నాటాలి అని సంప్రదాయం చెపుతుంది. అక్షయ తృతీయ పితృదేవతలకు తర్పణాలు విడిస్తే వారికి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. అక్షయ తృతీయ గోదానం చేస్తే సుఖ సంతోషాలు దక్కుతాయి.
 
ఇక ఈ రోజు తప్పకుండా బంగారం కొనాలని అంటారు. బంగారం కొంటే అక్షయం అవుతుందని అంటే తరగకుండా అలాగే ఉంటుందని అంటారు. కాగా భక్తులు వారి స్తోమతను బట్టి బంగారం కొనాలి. 
 
ఈ మాసంలో వచ్చే ప్రథమ పండుగ ఇది అక్షయ తృతీయ. ఈరోజు శ్రీలక్ష్మీనారాయణులను అత్యంత భక్తితో ప్రార్థన చేస్తే శుభం అని పండితులు పేర్కొంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు