అలాగే విష్ణుమూర్తి ప్రీతి కోసం అన్నార్తులందరికి అన్నదానం చేయవచ్చు. వేసవి తీవ్రత అధికంగా ఉండే అపర ఏకాదశి రోజు ఉపవాసం చేసేవారు చలివేంద్రాలు ఏర్పాటు చేసి మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీరు వంటివి అందించాలి. ఇలా చేయడం వలన ఈ జన్మలో చేసిన పాపాలే కాకుండా పది జన్మల పాపాలు కూడా నశిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి.
మే 23వ తేదీ శుక్రవారం, వైశాఖ బహుళ ఏకాదశిని అపార ఏకాదశిగా జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఏకాదశి తిథి ప్రధానంగా విష్ణుమూర్తి పూజకు శ్రేష్టమైనది. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన వామనవతారాన్ని ఈ అపర ఏకాదశి రోజు పూజించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
అపర ఏకాదశి రోజున పూజ సమయంలో శ్రీ మహా విష్ణువు, లక్ష్మీ దేవికి పండ్లు, స్వీట్లు మొదలైనవి సమర్పించండి. నైవేద్యంలో తులసి దళాలను చేర్చాలి. తులసి దళాలు లేని నైవేద్యాన్ని భగవంతుడు అంగీకరించడని నమ్ముతారు. అపర ఏకాదశి రోజున సాయంత్రం తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం.
అంతేకాదు అపర ఏకాదశి రోజున, విష్ణువును ధ్యానించి, తులసి మొక్కకు ఏడు సార్లు ప్రదక్షిణ చేయండి. ఇలా చేయడం వలన ఆరోగ్యంగా ఉంటారని విశ్వాసం. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ ఏకాదశి దుష్కర్మలను తొలగించడానికి చాలా బలమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఏకాదశి వ్రతాన్ని అంకితభావంతో ఆచరించే వ్యక్తులకు అదృష్టం వరిస్తుంది.