కుజ దోషం వుంటే వివాహానికి అడ్డంకులు ఏర్పడుతుంటాయన్నది విశ్వాసం. అందుకే కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామాళి రోజు 9సార్లు 12 రోజులు పారాయణ చేసి వల్లీ, దేవసేనా అష్టోత్తర శతనామాలు ఒకసారి చదవాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. సుబ్రహ్మణ్యమాలా మంత్రము రోజుకొకసారి 40 రోజులు పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.
ఏడు మంగళవారములు ఉదయం ఆరు గంటల నుంచి ఏడుగంటల లోపున శివాలయంలో ఏక రుద్రాభిషేకం చేయించడం ద్వారా కుజదోషాన్ని నివారించవచ్చు. ఏడు మంగళవారములు కుమార స్వామికి గానీ, నాగేంద్రస్వామి పుట్టకుగాని 70 ప్రదక్షిణలు చేస్తే కుజదోషాన్ని పోగొట్టుకోవచ్చంటున్నారు.
శనివారం ఉదయం 9-30 నుంచి 11 గంటల వరకు, ఆదివారం సాయంత్రం 4-30 నుంచి ఆరు గంటల వరకు, సోమవారం ఉదయం 7-30 నుంచి 9-00 గంటల వరకు.. రాహుకాలములో అష్టమూలికా తైలంతో సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన ఎర్రటి వత్తులతో చేసినట్లైతే చాలా మంచిది. కృష్ణా జిల్లాలోని మోపిదేవి క్షేత్రమును దర్శించి 70 ప్రదక్షిణములు చేసి వెండి సర్ప పడగను హుండీలో వేసి అభిషేకం చేయించుకొనవలెను.