పండుగలు చేసుకోవడం అంటే ఏమిటి?

సిహెచ్

బుధవారం, 9 ఏప్రియల్ 2025 (19:19 IST)
మన జీవితం గురించి లోతుగా ఆలోచిస్తే మన వ్యక్తిత్వానికి ఏమాత్రమూ ప్రాధాన్యమున్నట్లు తోచదు. మన దేహంలోని పదార్థమంతా బయట ప్రకృతి నుండి అన్నపానీయాల రూపములో వచ్చినదే. దానిని మన దేహ రూపంలో నిలిపి జీవ ధర్మాలతో ప్రవర్తించేలా చేసే సూత్రం గూడా మనం నిర్మించుకొన్నది గాదు. అదే మనను, ఈ అనంతకోటి జీవరాశిని సృష్టించి నడిపిస్తున్నది. అదే యీ సృష్టియంతటినీ చేసి ప్రకృతి సూత్రాల ననుసరించి నడిపించే విశ్వశ క్తిలో అంతర్భాగమే! మన మనస్సులో చెలరేగే ఆలోచనలు. హృదయంలో పెల్లుబికే భావాలు, వాటిననుసరించే మన ప్రవర్తన యిందులో ఏదీ మనం నిర్ణయించుకొనేది గాదు. ఆ విశ్వశక్తి చేసిన యీ సృష్టియొక్క తత్వమే మన నిర్ణయాలను గూడా అనుక్షణమూ రూపొందిస్తుంటుందని తోస్తుంది.
 
ఈ భావం స్పష్టంగానో, అస్పష్టంగానో మానవ జాతి యంతటికీ యీ విశాలసృష్టిని చూడగానే కల్గుతుంది. ఈ భావమే ప్రపంచ చరిత్ర పొడుగునా విశ్వజనీనంగా ప్రకటమౌతూ వచ్చిన మత భావానికి మూలం. మానవ తాత్విక చింతన, వైజ్ఞానికమైన పరిశోధన, అపార మైన భక్తిభావాలకూ మూలమైంది. ఈ సృష్టియంతటికీ యైన ఆ శక్తియే దైవమని చాలినంత లోతుగా గుర్తించిన సత్య ద్రష్టలందరూ ఆయన అనుగ్రహానికీ అబ్బురపడ్డారు. జీవులకు మాతృత్వము, వాత్సల్యము, గుడ్డులోనో లేక గర్భంలోనో పెరుగుతున్న జీవికి ముందుముందు అవసరమవ్వబోయే శారీరక మానసిక నిర్మాణం యిచ్చిన ఆ దైవమెంత దయామయుడో గుర్తించి జీవితమంతా ఆయనపట్ల కృతజ్ఞతతో ప్రవర్తించడమే మన జీవితానికంతటికీ మూలస్థంభమైంది. ఇందుకు సాధనంగా ప్రాకృతిక జీవితమంతటినీ రూపొందించు కొనడమే మతాల తత్వం. సంవత్సరం పొడవునా అనేక వేడుకల, పండుగల రూపంలో ఆ భగవంతుడనుగ్రహించిన శక్తిసామర్ధ్యాలకు, బాహ్యమైన ప్రకృతి సంపదకు అందరూ కలిసి కృతజ్ఞత తెల్పుకొనడమే అసలు పండుగలు చేసుకొనడమంటే. అటువంటివాటిలో సంక్రాంతి ఒకటి.
 
పండుగలు రెండు రకాలు. రాముడు, క్రిష్ణుడు వంటి అవతార పురుషుల జీవిత సంఘటనలకు సంబంధించినవి కొన్ని; దేవతలకు మాత్రమే సంబంధించి, అలా చెప్పబడే ప్రకృతిశక్తుల సామూహిక కార్యమైన సంవత్సర చక్రానికి సంబంధించిన పండుగలు కొన్ని. సంక్రాంతి, ఉగాది, కార్తీక ధనుర్మాసాలు మొదలైనవి యీ రెండవ కోవకు చెందినవి. సంవత్సరం పొడుగునా ప్రకృతి రూపంలో భగవంతుడు మనకు చేసిన మేలుకు కృతజ్ఞతలు సామూహికంగా తెల్పుకొనేవే యీ పండుగలన్నీ. ఇలానే రోజంతటిలోనూ సంధ్యా వందనము వైశ్వదేవము వంటి విధులు దానము, మొదలైన ధర్మాలు అన్నీ భగవంతునికి.
 
ఆయన అంశలు, ప్రకృతి శక్తులూ అయిన దేవతలకు ఆధ్యాత్మిక మైన అనుగ్రహ రూపాలైన ఋషులకు మనం తెల్పుకొనే కృతజ్ఞతలే. ఒక్కమాటలో చెప్పాలంటే నీతి, ధర్మాచరణ యావత్తూ భగవంతునిపట్ల కృతజ్ఞతతో గూడిన విధేయతే. భావమే! యిట్టి ఆచరణే అనుక్షణమూ భగవంతుని రూపాలైన జీవులన్నిటిపట్లా కల్గియుండాలని సాయిబాబా గూడ తమ ఆచరణద్వారా బోధించారు. వారి గురువు పట్ల వారికెంత కృతజ్ఞతో! ఆయన ప్రసాదించిన విలువలేని యిటుక రాయిని గూడ ఆయన తమ ప్రాణంతో సమానంగా చూచుకొన్నారు. అది విరగడమంటే వారి ప్రారబ్దం విరగడమేనట. ఆయనను బైజాబాయి ప్రేమతో సేవించినందుకు ఆమెను, ఆమె బిడ్డడైన తాత్యాను గూడా సాయి ఎంత ప్రేమగా చూచుకొన్నారో.
 
మహల్సాపతి మరియు మేఘుడినిగూడ ఆయనలానే చూసుకొన్నారు. కృతజ్ఞతన్నది ధర్మాచరణకు, ఆధ్యాత్మికతకూ గూడ మూలస్థంభమని చెప్పవచ్చు. అందుకే మన ధర్మ శాస్త్రాలన్నీ భగవంతుని తర్వాత మనకు పుట్టుకనిచ్చి పోషించిన తల్లిదండ్రులకు ఎప్పుడూ కృతజ్ఞులమై వుండాలని చెప్పాయి. రాముడు, కృష్ణుడు తమ తల్లిదండ్రుల, గురువుల పట్ల ఎంత కృతజ్ఞతతో వ్యవహరించారో, ఆదిశంకరులు, శ్రీపాద శ్రీవల్లభులు, శ్రీనృసింహసరస్వతులు తమ తల్లుల మాటలకు అందుకే కట్టుబడ్డారు. శ్రీ సాయి గూడా గత జన్మలలో తమ తల్లి మరియు సోదరుల పట్ల- వారి అవగుణాలను గూడా లక్ష్యపెట్టక తమ ధర్మం తామెంత చక్కగా నిర్వహించారో, తమకు బట్టలునేసే ఉద్యోగ మిచ్చిన యజమానిపట్ల ఎంత విధేయతతో ప్రవర్తించారో గమనించాలి.
 
ఇలా మన ధర్మంయొక్క పండుగలయొక్క తత్వము వాటిలో దాగియున్న భావమేమిటో తెలిసికొని మనం పండుగలు చేసుకొంటే మన జీవితాలు సార్ధకమౌతాయి. లేకుంటే నిరర్ధకమౌతాయి. తెలుసుకొని భావయుక్తంగా చేసుకుంటే పండుగ, లేకుంటే దండుగ! 
-పూజ్య ఆచార్య ఎక్కరాల భరద్వాజ

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు