అందులో భాగంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో నిర్వహించే డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను భక్తుల కోరిక మేరకు ప్రయోగాత్మకంగా ఆదివారం నుండి టిటిడి ప్రారంభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్-19 మార్గదర్శకాల మేరకు భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని శ్రీవారి ఆర్జిత సేవలను టిటిడి ఏకాంతంగా నిర్వహిస్తున్నవిషయం తెలిసిందే.
ఇందులో భాగంగా స్వామివారి ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను ఆన్‌లైన్ వర్చ్యువల్ సేవగా నవంబరు రెండవ వారం నుండి భక్తులకు అందుబాటులో ఉంచేందుకు టిటిడి చర్యలు చేపట్టింది. ఈ సేవలు పొందిన భక్తులకు ఆ టికెట్టుపై శ్రీవారి దర్శనం ఉండదు. దర్శనం పొంద దలచిన గృహస్తులు శ్రీవారి దర్శనం కొరకు ప్రత్యేక దర్శన టికెట్లు ఆన్ లైన్ లో పొందవలసి ఉంటుంది. ఆలయంలో ఏకాంతంగా నిర్వహించే ఈ ఉత్సవాలను ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.