శ్రీవారి సేవలోనే చదలవాడ... తితిదే పాలక మండలి మరో యేడాది పొడగింపు

గురువారం, 28 ఏప్రియల్ 2016 (11:24 IST)
అనుకున్నట్టుగానే తితిదే పాలక మండలి కాలపరిమితి మరో యేడాది పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు పొడగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవదాయ శాఖ పంపిన దస్త్రంపై గురువారం ముఖ్యమంత్రి సంతకం చేశారు. దీంతో తితిదే ఛైర్మన్‌గా చదలవాడ కృష్ణమూర్తి మరో సంవత్సరం పాటు శ్రీవారి సేవలో తరించనున్నారు. అలాగే, పాలక మండలిలోని 16 మంది సభ్యులు మరో యేడాది పాటు సభ్యులుగా కొనసాగుతారు. 
 
గతంలో తితిదే పాలక మండలి పదవీ కాలం ఐదేళ్ళపాటు ఉండేది. దీన్ని యేడాదికి తగ్గించారు. పాలక మండలి ఛైర్మన్‌‌తో పాటు సభ్యులు ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ఉండాలనే ఉద్దేశంతో సంవత్సరానికి పాలకమండలి పదవీ కాలాన్ని కుదించారు. దీంతో చదలవాడ క్రిష్ణమూర్తితో పాటు పాలకమండలి సభ్యులు సంవత్సరం మాత్రమే కొనసాగారు. వీరి పదవీకాలం బుధవారంతో ముగిసింది. దీంతో ఏపీ దేవదాయశాఖ ఒక దస్త్రాన్ని తయారు చేసి సీఎం ముందు ఉంచింది.
 
ప్రస్తుతం కొనసాగుతున్న పాలకమండలినే కొనసాగిస్తూ దస్త్రాలు సిద్ధం చేసింది. ఈ దస్త్రంపై సీఎం గురువారం విజయవాడతో సంతకం చేశారు. అయితే పాలకమండలిలో ఎమ్మెల్యేల కోటా కింద కోళ్ల లలితకుమారి, పిల్లి అనంతలక్ష్మి, వీరాంజనేయస్వామి, సండ్ర వెంకటరవీరయ్య, సాయన్న, ఇతరుల కోటా కింద దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, పుట్టా సుధాకర్‌ యాదవ్‌, రమణ, సుచిత్రా, హరిప్రసాద్‌, తమిళనాడ రాష్ట్రం నుంచి క్రిష్ణమూర్తి, శేఖర్‌ రెడ్డి, కర్ణాటక రాష్ట్రం నుంచి సంపత్‌ రవినారాయణన్‌, అనంత్‌లను సభ్యులగా నియమించారు. పదవీరీత్యా సభ్యులుగా దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లు, తితిదే ఈఓ నియామకం జరిగింది. 
 
ఆ తర్వాత కొంత కాలానికి బీజేపీ నేత భానుప్రకాష్‌ రెడ్డిని కూడా సభ్యులుగా నియమించారు. మరికొంత కాలానికి తెలంగాణలోని బిజెపి ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డిని హైదరాబాద్ సమాచార కేంద్రం సలహామండలి అధ్యక్షుడిగా నియమిస్తూ పదవీరీత్యా సభ్యుడిగా స్థానం కల్పించారు. వీరందరికీ కూడా నిబంధనల ప్రకారం పదవీ కాలం పూర్తయ్యింది. అయితే ప్రస్తుత పాలకమండలిలో కొంతమంది నూతన సభ్యులు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
తెలంగాణ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సాయన్న టిడిపి నుంచి తెరాసలో చేరారు. గత నాలుగు నెలల నుంచి ఆయన సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు. ఈయన స్థానంలో మరొకరిని నియమించే అవకాశాలున్నాయి. అలాగే కర్ణాటక రాష్ట్రానికి చెందిన మాజీ ప్రధాని దేవగౌడ తన మనువడికి సభ్యుడిగా అవకాశం కల్పించాలని కూడా ముఖ్యమంత్రిని ఇప్పటికే కోరారు. దీంతో ఆయనకు మరో సభ్యుడిగా అవకాశం ఇచ్చే ఛాన్సుంది. 
 
నూతన పాలకమండలి సభ్యుల విషయాన్ని అటుంచితే పాత పాలకమండలి సభ్యులతో పాటు ఛైర్మన్‌ను యధావిధిగా కొనసాగిస్తూ సీఎం సంతకం చేశారు. విజయవాడలో ఆయన దస్త్రాలపై సంతకం చేశారు. దీంతో ప్రస్తుత పాలకమండలి మరో సంవత్సరం పాటు కొనసాగుతుంది. మిగిలిన నూతన సభ్యులను మరో 15 రోజుల్లో నియమించనున్నారు.

వెబ్దునియా పై చదవండి