ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్‌లో లక్ష్యసేన్ సంచలనం సృష్టించాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్యసేన్ సత్తా చాటాడు. ఆద్యంతం మెరుగైన ఆటతీరుతో లక్ష్యసేన్ ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆరోసీడ్ సేన్ 21-19, 21-18తో టాప్‌సీడ్, డిఫెండింగ్ ఛాంపియన్ కులావత్ వితిసన్ (థాయ్‌లాండ్)ను మట్టికరిపించాడు.
తొలి గేమ్ ఆరంభంలో వితిసన్ ఎదురుదాడి చేస్తూ పాయింట్లు సాధించగా.. లక్ష్యసేన్ వెంటనే పుంజుకున్నాడు. డ్రాప్ షాట్లు, మెరుపు స్మాష్‌లతో విజృంభించిన సేన్, కీలక సమయంలో పాయింట్స్ గెలిచి మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. వరుస పాయింట్లతో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించాడు. తద్వారా 53 సంవత్సరాల తర్వాత లక్ష్యసేన్ ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్‌లో బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నట్లైంది.
టైటిల్ గెలిచే క్రమంలో అతను టాప్‌సీడ్‌తో పాటు రెండో సీడ్ లి షిఫెంగ్ (చైనా), నాలుగో సీడ్ లియానార్డొ (ఇండోనేషియా)లకు షాకిచ్చాడు. ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్‌కు భారత బ్యాడ్మింటన్ సమాఖ్య (బాయ్) రూ.10 లక్షల నజరానా ప్రకటించింది.