భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తొమ్మిదేళ్ల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు తెలంగాణ రాష్ట్ర ఓటర్లు తేరుకోలేని షాకిచ్చారు. ఆదివారం వెల్లడైన ఆ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో అధికార భారాసకు షాకిచ్చారు. అలాగే, సీఎం కేసీఆర్ నియంతృత్వ పోకడలకు కూడా తగిన బుద్ధి చెప్పారు. ఈ ఎన్నికల్లో ఆయన రెండు చోట్ల పోటీ చేసి ఒక చోట చిత్తుగా ఓడిపోయారు. మరో చోట తక్కువ మెజార్టీతో గెలుపొందారు.
సీఎం హోదాలో కామారెడ్డిలో పోటీ చేసిన కేసీఆర్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి పోటీ చేశారు. సీఎం కేసీఆర్, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి రేవంత్ రెడ్డిని బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి 5156 ఓట్ల తేడాతో ఓడించి, సంచలనం సృష్టించారు. రేవంత్ రెడ్డి రెండో స్థానంలో, కేసీఆర్ మూడో స్థానానికి పరిమితమయ్యారు.
అయితే, గజ్వేల్ నుంచి బరిలోకి దిగిన సీఎం కేసీఆర్ మాత్రం హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. ఈ స్థానంలో బీజేపీ నుంచి, కేసీఆర్ శిష్యుడు, బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీ చేశారు. దీంతో 2018 ఎన్నికలతో పోల్చితే సీఎం కేసీఆర్ మెజార్టీ తగ్గిపోయింది.