తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా అనేక ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో రైలు కట్టలు దెబ్బతినివున్నాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో రైలు పట్టాల కింద కంకర కొట్టుకునిపోయింది. దీంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య పీఆర్వో శ్రీధర్ తెలిపారు.
36 రైళ్లు రద్దు, 25 రైళ్లు దారిమళ్లింపు, 14 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్టు ఆయన వివరించారు. కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల రైలు మార్గంలో వరద నీరు ముంచెత్తింది. దీంతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు.
భారీ వర్షాల నేపథ్యంలో రైల్వే ప్రయాణికులకు సహాయం కోసం పెల్ప్ లైన్ నంబర్లను రైల్వే శాఖ ప్రకటించింది. కాచిగూడ 90633, 18082, నిజామాబాద్ 970032, 96714, కామారెడ్డి 92810, 35664, సికింద్రాబాద్ 040 - 277 86170 నంబర్లను సంప్రదించాలని సూచించింది.