తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ!!

ఠాగూర్

శనివారం, 6 ఏప్రియల్ 2024 (14:41 IST)
తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అయితే రాజధాని హైదరాబాద్ నగరంలో మాత్రం వర్షానికి మాత్రం అవకాశం లేదని పేర్కొంది. రానున్న మూడు రోజుల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొంది. అయితే, శుక్రవారం నల్గొండ జిల్లా ఇబ్రహీంపట్టణంలో అత్యధికంగా 43.5 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైన విషయం తెల్సిందే. 
 
ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు చెప్పింది. ఆదివారం నుంచి మంగళవార వరకు మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, కుమరంభీమ్, అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలతో పాటు జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో సోమవారం వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీచేసింది. అయితే, మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నప్పటికీ హైదరాబాద్ వాసులకు మాత్రం నిరాశే. భాగ్యనగరంలో మాత్రం వర్షం పడే అవకాశం లేదని పేర్కొంది.  
 
వచ్చే రెండు రోజుల్లో రాష్ట్రంలో వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. ఉష్ణోగ్రతలు రెండుమూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని కూడా పేర్కొంది. రాష్ట్రంలో గరిష్ఠంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించింది. శనివారం పలు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది.
 
శుక్రవారం అత్యధికంగా నల్గొండ జిల్లా ఇబ్రహీంపేటలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు అక్యూట్ డయేరియా డిసీజ్ (ఏడీడీ) బారినపడుతున్నారు. డీహైడ్రేషన్ కేసులు కూడా పెరుగుతున్నట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. పిల్లలు వాంతులు, విరేచనాలకు గురైనప్పుడు కొబ్బరినీళ్లు, ఓఆర్ఎస్ వంటివి ఇవ్వాలని, నీడపట్టున ఉంచాలని సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు