ఎన్నికలకు దూరంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీ!

వరుణ్

మంగళవారం, 26 మార్చి 2024 (13:17 IST)
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీ ఎన్నికలకు దూరమైంది. పార్టీని స్థాపించిన తర్వాత తొలిసారి కేసఆర్ కుటుంబం ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో 23 యేళ్ళ క్రితం ఆయన పార్టీని స్థాపించారు. ఆ తర్వాత ఆ పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించిన 23 యేళ్ల నుంచి ఆయన కుటుంబం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తుంది. కానీ, తొలిసారి త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఆ ఫ్యామిలీకి చెందిన ఏ ఒక్కరూ పోటీ చేయడం లేదు. 
 
నిజానికి ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ, భారాస ప్రకటించిన 17 లోక్‌సభ అభ్యర్థుల పేర్ల జాబితాలో ఆయన పేరు లేదు. ఒక్క కేసీఆర్ ఫ్యామిలీ నుంచే కాదు.. హరీష్ రావు కుటుంబం నుంచి కూడా ఒక్కరూ కూడా పోటీ చేయడం లేదు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కేటీఆర్ లేదా హరీష్ రావు పోటీ చేస్తారనే ప్రచారం పెద్ద ఎత్తునసాగింది. కానీ, వీరిద్దరిలో ఎవరూ బరిలోకి దిగలేదు. లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. 
 
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో భారాస ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈమె తీహార్ జైలులో ఉంటున్నారు. ఆమె దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరుగుతుంది. అయితే, ఆమెకు కోర్టు బెయిల్ ఇస్తుందా లేదా అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు