"నన్ను... నా పార్టీని టచ్ చేయడం నీ వల్ల కాదు.. ఉడుత బెదిరింపులకు భయపడ" : సీఎం రేవంత్‌కు కేసీఆర్ హెచ్చరిక

ఠాగూర్

బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (08:56 IST)
"నన్ను.. నా పార్టీని టచ్ చేయడం నీ వల్ల కాదు.. నీ కంటే హేమాహేమీలనే ఎదుర్కొన్న చరిత్ర మాకుంది. ఉడుత బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు. ముందు ముందు ఏందో చూద్దాం" అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గట్టిగా హెచ్చరించారు. అయితే, నేరుగా సీఎం రేవంత్ రెడ్డి పేరును ఎక్కడా ప్రస్తావించకుండా పరోక్షంగా హెచ్చరించారు. అయితే, కొత్త సీఎం అంటూ సంబోధించడంతో కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించే ఈ వార్నింగ్ ఇచ్చారంటూ భారాస శ్రేణులు, నేతలు అంటున్నారు. 
 
దాదాపు మూడు నెలల తర్వాత కేసీఆర్ హైదరాబాద్ నగరంలోని భారాసా ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్‌కు వచ్చి పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, కొత్త అని సంభోధిస్తూ అవగాహన రాహిత్యంతో కొత్త ముఖ్యమంత్రి తనను వ్యక్తిగతంగా, బీఆర్ఎస్‌ పార్టీని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నట్టు సమాచారం. కృష్ణా జలాల పరిరక్షణ కోసం తమ పార్టీ ఆందోళన చేపట్టనుంది. ఇందులోభాగంగా, ఈ నెల 13వ తేదీన భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ సభ ఏర్పాట్లపై కేసీఆర్ మంగళవారం పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. ఇందులో ఉమ్మడి హైదరాబాద్, పాలమూరు, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు చెందిన పార్టీ ప్రతినిధులు మాత్రమే హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రాన్ని పదేళ్లు తాము పదిలంగా కాపాడుకున్నాం. కాంగ్రెస్‌ నేతలకు తెలివి లేదు. ఇప్పుడున్న పాలకులకు ప్రాజెక్టులు, నీళ్ల గురించి అవగాహన లేదు. అందుకే కేంద్రం గేమ్‌ స్టార్ట్‌ చేసి కేఆర్‌ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకొంది. సాగర్‌, శ్రీశైలం సహా కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పజెప్పిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చేతికి మన జుట్టు అందించింది. అవగాహన రాహిత్యంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం సంతకాలు చేసి మరీ తీసుకున్న ఈ నిర్ణయం దక్షిణ తెలంగాణ సాగునీటి హక్కులపై గొడ్డలిపెట్టులా మారింది అని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఈ నిర్ణయం కారణంగా, ఉమ్మడి హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లా ప్రజలు సాగు, తాగునీరు అందక మళ్లీ కరువు కోరల్లో చిక్కుకునే ప్రమాదం ఏర్పడింది. ఈ అంశంపై కాంగ్రెస్‌ నేతలకు అవగాహన లేక ఏదేదో మాట్లాడుతున్నారని, వాస్తవ విషయాలను ప్రజలకు వివరించి.. చెప్పాల్సిన బాధ్యత మనపైనే ఉంది. కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా పదేళ్లలో ఏనాడూ తెలంగాణ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించలేదు. ప్రాజెక్టులను తమకు అప్పగించాలని, లేదంటే తామే నోటిఫై చేస్తామని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ బెదిరించారు. కావాలంటే తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టుకో. నా ప్రభుత్వాన్ని రద్దు చేస్తా. తెలంగాణకు అన్యాయం చేస్తామంటే అసలే ఒప్పుకోను. ప్రాజెక్టులను అప్పగించే ప్రసక్తే లేదు అని అపుడే తేల్చి చెప్పాను అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు