అవినీతి ఇంజనీర్‌ను పక్కా ప్లాన్‌తో పట్టుకున్న ఏసీబీ... బోరున విలపించిన అధికారి...

వరుణ్

మంగళవారం, 20 ఫిబ్రవరి 2024 (14:51 IST)
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి మహిళా అధికారిని ఆ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకుని అరెస్టు చేశారు. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. దీంతో లంచం తీసుకున్న చేతులే ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాయి. ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన తర్వాత ఆ మహిళా ఇంజనీర్ మీడియా ముందు బోరున విలపిస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
హైదరాబాద్ నగరంలో ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసు కార్యాలయం ఉంది. ఇందులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా జగజ్యోతి పని చేస్తున్నారు. ఈమె ఓ పని చేసి పెట్టేందుకు లంచం డిమాండ్ చేస్తున్నట్టు ఓ వ్యక్తి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు పక్కా స్కెచ్ రూపొందించారు. రసాయనాలలో ముంచిన నోట్లను బాధితుడికి అందించి, వాటిని జగజ్యోతికి లంచంగా ఇవ్వాలని సూచించారు. ఏసీబీ అధికారులు చెప్పినట్టుగానే బాధితుడు వాటిని తీసుకెళ్లి జగజ్యోతికి అందజేశారు. 
 
ఆ సమయంలో అక్కడే కాపుకాసిన అధికారులు.. జగజ్యోతి ఆ నోట్లను తీసుకోగానే వెళ్లి పట్టుకున్నారు. సాక్ష్యం కోసం వీడియో రికార్డింగ్ చేస్తూ ఆమె చేతులను రసాయనంతో కడగగా, నోట్లకు పూసిన కెమెకల్ కారణంగా జగజ్యోతి చేతులు రంగు మారాయి. దీంతో ఆమె క్యాబిన్‌తో పాటు నివాసాన్నిఏసీబీ అధికారులు తనిఖీ చేసి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, జగజ్యోతి కెమెరా కంటికి చిక్కగానే బోరున విలపిస్తూ కనిపించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు