ప్రపంచ పర్వతాల శిఖరాల అధిరోహణే ధ్యేయం: అన్వితా రెడ్డి

బుధవారం, 25 మే 2022 (21:14 IST)
ప్రపంచంలోని అన్ని ఖండాలలో ఎత్తైన పర్వత శిఖరాలను అధిరోహించటమే తన ముందున్న ప్రధాన ద్యేయమని పర్వతారోహకురాలు అన్వితా రెడ్డి అన్నారు. ఎవరెస్టు పర్వతాన్ని దిగ్విజయంగా అధిరోహించిన తదుపరి హైదరాబాద్ చేరుకున్న అమెను స్పాన్సర్స్‌గా వ్యవహరించిన అన్వితా గ్రూపు అధినేత బొప్పన అచ్యుతరావు బుధవారం మీడియాకు పరిచయం చేసారు.

 
హోటల్ మెర్య్కూరిలో ఏర్పాటు చేసిన సమావేశంలో అన్వితా మీడియాతో తన అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా అన్వితా రెడ్డి, కోచ్‌ శేఖర్‌ బాబులను అన్విత గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అచ్యుత రావు బొప్పన ఘనంగా సన్మానించారు. అన్వితా రెడ్డి మాట్లాడుతూ, తొలి నుండి తన పర్వతారోహణకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందింస్తున్న అన్వితా గ్రూపు అధినేతలు అచ్యుతరావు బొప్పన, నాగభూషణం బొప్పన, అనూప్ బొప్పన, శ్రీకాంత్ బొప్పనలకు తాను ఎంతో రుణపడి ఉంటానన్నారు.

 
సాహస క్రీడ కావడం, ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పోవటం, తల్లిదండ్రులను ఒప్పించడంతో సహా గత ఎనిమిదేళ్లుగా తాను ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు తన కల సాకారమైందన్నారు. అన్వితా గ్రూప్‌ ఎమ్‌డి అచ్యుత రావు అందించిన ఆర్థిక సహకారం వల్ల, తాను ఆశయ సాధనపై ఏకాగ్రతతో దృష్టి పెట్టేగలిగానన్నారు. అన్వితా నిబద్ధత, అంకితభావాన్ని దృష్టిలో ఉంచుకుని తమ సంస్ధ ఈ ప్రోత్సాహాన్ని అందించిందని అన్విత గ్రూపు అధినేత అచ్యుతరావు అన్నారు.


భవిష్యత్తులో సైతం ప్రపంచ వ్యాప్తంగా విభిన్న శిఖరాలను అధిరోహించేందుకు అన్వితా గ్రూప్‌ తన మద్దతును కొనసాగిస్తుందని వివరించారు. కోచ్‌ శేఖర్‌ బాబు మాట్లాడుతూ అన్వితా రెడ్డి శారీరక, మానసిక ఓర్పుతో సరైన వరిజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని, అనుభవాన్ని సంపాదించు కోగలిగారన్నారు. రాబోయే కాలంలో మరిన్ని విజయాల సాధనకు సిధ్దం కానుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు.

 
విమానాశ్రయంలో ఘన స్వాగతం: దిగ్విజయంగా ఎవరెస్టును అధిరోహించి బుధవారం తొలిసారిగా సొంతగడ్డపై అడుగుపెట్టిన అన్వితాకు హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎవరెస్టు అధిరోహణకు స్పాన్సర్‌గా వ్యవహరించిన అన్వితా గ్రూప్ ఎండి అచ్యుతరావు బొప్పన, డైరెక్టర్ నాగభూషణం బొప్పన తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాయదుర్గంలోని అన్విత గ్రూపు కార్పొరేట్ కార్యాలయాన్ని సందర్శించిన అన్విత భావోద్వేగానికి లోనయ్యారు. సంస్థ అండదండలే తనను ఇక్కడి దాకా తీసుకువచ్చాయన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు