కూకట్‌పల్లి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బండ్ల గణేశ్..?

ఆదివారం, 8 అక్టోబరు 2023 (13:56 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార తెరాస, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూకట్‌పల్లి స్థానం నుంచి సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ పోటీ చేయొచ్చన్న వార్తలు వెలువడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో బలమైన సామాజిక వర్గానికి టిక్కెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుందని, అందుకే బండ్ల గణేశ్ వైపు మొగ్గు చూపగా, ఆయన కూడా ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
అయితే, ఈ ప్రచారంపై బండ్ల గణేశ్ ఆదివారం సోషల్ మీడియాలో వేదికగా క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని చెప్పారు. తనకు టిక్కెట్ ఇస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారని, కానీ తాను సున్నితంగా తిరస్కరించినట్టు చెప్పారు. తనకు టిక్కెట్ కంటే ఈదఫా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఎంతో ముఖ్యమన్నారు. 
 
అందుకోసం తాను పని చేస్తానని తెలిపారు. పైగా, టిక్కెట్ కోసం తాను దరఖాస్తు కూడా చేసుకోలేదని చెప్పారు. రేవంత్ నాయకత్వంలో పని చేస్తామని, ఈసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని, పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని బండ్ల గణేశ్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు