మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనుండటంతో ఖాయం కానున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక వేళ రాజకీయ సమీకరణాలు మారనున్నాయా? గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఈటెల చేతిలో ఓడిన పాడి కౌశిక్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధమవుతోందా? తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు ఈ దిశగా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
అయితే ఈటలను ఢీకొనే స్థాయి గల నాయ కుడు టీఆర్‌ఎస్ నుంచి హుజూరాబాద్‌లో ఎవరూ ఎదగకపోవడం ఆ పార్టీలో గుబులు రేపుతోంది. ఈ నేపథ్యంలో గతంలో ఈటలపై పోటీ చేసి ఓడిన వకులాభరణం కృష్ణమోహన్ రావు, మాజీ మంత్రి, బీజేపీ నేత ఇనుగాల పెద్దిరెడ్డి, కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుటుంబం నుంచి ఒక్కొక్కరి పేర్లు టీఆర్‌ఎస్ అభ్యర్థి రేసులో వినిపించగా తాజాగా పాడి కౌశిక్‌రెడ్డి అభ్యర్థిత్వంపైనా చర్చ జరుగుతోంది.
2018 ఎన్నికల్లో ఈటలపై పోటీ చేసిన కౌశిక్ సుమారు 40 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినా హుజూరాబాద్‌లో సమస్యలపై గళం విప్పుతూనే ఉన్నారు. ఈటలను టార్గెట్‌గా చేసుకొని విమర్శలు కురిపించేవారు. టీఆర్‌ఎస్‌లో ఈటలకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ అగ్రనేతలు సాను భూతి వ్యక్తం చేసినా కౌశిక్‌రెడ్డి మాత్రం ఈటల భూకబ్జాల పేరుతో మీడియా సమావేశాలు పెట్టి మరీ ధ్వజమెత్తారు.