పెళ్లిలో నృత్యం చేస్తూ సందడి.. అంతలోనే ట్యాంక్ వెనుక శవమైన యువకుడు

గురువారం, 31 ఆగస్టు 2023 (15:29 IST)
తల్లిదండ్రులతో కలిసి ఓ ఏడేళ్ల చిన్నారి బంధువుల ఇంట జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యాడు. పెళ్లిలో తన సహచరులతో కలిసి నృత్యం చేస్తూ సందడి చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే అదృశ్యమైన అతడు చివరకు ఫంక్షన్ హాల్ వెనకున్న నీటి ట్యాంక్ పడి మరణించాడు. ఈ విషాదకర ఘటన హైదాబాద్ నగర శివారు ప్రాంతమైన శంషాబాద్‌లో ఆర్ ఐఏ ఠాణా పరిధిలో జరిగిన ఈ ఘటన పెళ్లి వేడుకలో జరిగింది.
 
పోలీసుల కథనం మేరకు.. నందిగామకు చెందిన శ్రీకాంత్ రెడ్డి తన కుమారుడు అభిజిత్ రెడ్డి, ఇతర కుటుంబసభ్యులతో కలిసి బుధవారం శంషాబాద్‌లో ఓ ఫంక్షన్ హాల్‌లో జరుగుతున్న పెళ్లి వేడుకకు వచ్చారు. ఈ సందర్భంగా అభిజిత్ రెడ్డి మండపం వద్ద దాండియా ఆడుతూ సందడి చేశాడు. పెళ్లి హడావుడిపై పడిపోయిన అతడి తల్లిదండ్రులు కాసేపటి తర్వాత అభిజిత్ అదృశ్యమైనట్టు గుర్తించి తల్లడిల్లిపోయారు. అంతటా విచారించినా బాలుడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
రంగంలోకి దిగిన పోలీసులు పలు కోణాల్లో విచారిస్తూ సీసీటీవీ కెమెరాలను కూడా పరిశీలించారు. ఈ క్రమంలో ఫంక్షన్ హాల్ వెనుక తెరిచి ఉన్న నీటిసంపులో చూడగా బాలుడి శవం కనిపించింది. దీంతో, పెళ్లివేడుకలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. 
 
మరోవైపు, ఫంక్షన్ హాల్ నిర్వహకుల నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మృతిచెందాడంటూ బంధువులు, స్నేహితులు ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత తలెత్తింది. ఈ కేసులో న్యాయం చేస్తామంటూ పోలీసులు హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా బాలుడి మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఫంక్షన్ హాల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు