గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్‌లో ఐఏఎస్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అనేక మంది అధికారులు నివసిస్తున్నారు. అయితే, ఈ ఏరియాలో చెట్లు, చిన్నచిన్న నీటికుంటలు, గుట్టలు అధికంగా ఉండటంతో విషసర్పాలు తరచుగా కనిపిస్తున్నాయి.
ఈ క్రమంలో గురువారం చీకటి పడిన తర్వాత సీఎస్ ఎస్కే జోషి ఇంటి వెనుకభాగంలో ఓ నల్లతాచు పాము వచ్చి పడగ విప్పి బుసలు కొట్టసాగింది. దీన్ని చూసిన జోషి కుటుంబ సభ్యులతో పాటు.. స్థానికులు భయంతో వణికిపోయారు. ఈలోగా విషయం తెలుసుకున్న హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది అక్కడుక వెళ్లి.. తన వద్ద ఉన్న ఓ పరికరంతో దాన్ని బంధించి చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ తర్వాత ఆ పాముకు ఎలాంటి హాని తలపెట్టకుండా దూరంగా వదిలిపెట్టాల్సిందిగా పోలీసులను కోరారు.