బాపు-రమణ, కృష్ణారెడ్డి-అచ్చిరెడ్డిలా మేము కూడా... చిరుతో సమస్యలొచ్చాయ్: అల్లు అరవింద్

మంగళవారం, 26 డిశెంబరు 2017 (13:00 IST)
మెగాస్టార్ చిరంజీవితో తన సంబంధం గురించి ఆయన బావమరిది, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల ఏపీ పర్యటనలో.. ప్రజారాజ్యం పార్టీ కనుమరుగవడానికి, పీఆర్పీ.... కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యేందుకు అల్లు అరవింద్ కూడా ఓ కారణమంటూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. చిరంజీవితో తనకు బావాబావమరిది రిలేషనే కాకుండా అంతకుమించి మంచి స్నేహితులమనే బంధం వుందని చెప్పుకొచ్చారు. 
 
తనపై నమ్మకంతో మెగాస్టార్ ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించానని, దీంతో మనసులో రెండో ఆలోచనల లేకుండా చిరంజీవి ఎక్కువగా సినిమాలపై ఫోకస్ చేయగలిగారన్నారు. తనకు చేతనైన సాయం చిరంజీవికి చేశానని తెలిపారు. సినీ పరిశ్రమలో దశాబ్దాల పాటు కలసి కొనసాగినవారు చాలా అరుదని... తనకు గుర్తున్నంత వరకు అలాంటి వారిలో బాపు-రమణ, కృష్ణారెడ్డి-అచ్చిరెడ్డి, చిరంజీవి-తాను ఉన్నామని అరవింద్ చెప్పారు. 
 
కానీ రాజకీయాల్లోకి వెళ్లినప్పుడు కొన్ని ఇబ్బందులు తలెత్తాయని.. తమ ఇద్దరి మధ్య చిన్నచిన్న సమస్యలు వచ్చాయని అల్లు అరవింద్ తెలిపారు. వ్యక్తిగతంగా తమ మధ్య విభేదాలు లేవని.. రాజకీయాల్లో వెళ్లినప్పుడు కొన్ని సమస్యల్ని ఎదుర్కోవలసి వచ్చిందన్నారు. కానీ అవికూడా తమపై పెద్దగా ప్రభావం చూపలేకపోయాయని... ఎప్పటిలాగానే తామిద్దరం కలిసే ముందుకు సాగుతున్నామని వివరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు