ఆప్త(అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియషన్) బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈవేడుకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంకా ఈకార్యక్రమంలో సూపూ కోటాన్, సాగర్ లగ్గిశెట్టి, రమేష్ తూము, మధు వల్లి, చంద్ర నల్లం, శ్రీనివాస్ చందు, శ్రీనివాస్ చిమట, విగయ్ గుడిసేవ, బాబీ అడ్డా, చలమశెట్టి అనీల్(గోపి) తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఆప్త(అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియషన్) వారి ఆధ్వర్యంలో నడుస్తోన్న కేటలిస్ట్ ప్రోగ్రామ్ దేశ విదేశాల నుంచి ఎందరో హాజరయ్యారు. యంగ్ ఎంటర్‌ప్రెన్యూరర్స్‌ని ఎంకరేజ్ చేయటానికి అందరూ ఇక్కడకు రావటం ఎంతో ఆనందంగా ఉంది. ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉంటే వచ్చే రిజల్ట్ చాలా గొప్పగా ఉంటుంది. ఇలాంటి ఫలితం మన ప్రాంతం, మన రాష్ట్రం, మన దేశం, మనం ఉండే ఇతర దేశాలకు ఉపయోగపడుతుందనే విశాలమైన దృక్పథంతో ఈరోజు ఈవెంట్‌ను నిర్వహించారు.
Chiru At Apta meeing
ఇక్కడున్న వారందరినీ నా ఆప్తులుగా భావిస్తున్నాను. ఇక్కడున్న వారందరూ నా కుటుంబ సభ్యులు. ప్రతీ ఒక్కరిలో నాపై వారికున్న అభిమానం, తెలుగు మీదున్న అభిమానం, దేశం మీదున్న అభిమానం కనిపిస్తోంది. నాకు గొప్ప స్వాగతాన్ని ఇచ్చిన వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అమెరికా నుంచి ఇంత మంది ఇక్కడకు వస్తారా? అని అందరూ అనుకుంటారు. కానీ అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ ఇంత మంది ఇక్కడకు రావటం అనేది గొప్ప విషయం. ఈ కమిటీలో ఉన్న అందరూ ఎంతో ఉత్సాహంగా ముందడుగు వేయటం ఎంతో మంది యంగ్‌స్టర్స్‌కి కొత్త శక్తిని ఇచ్చి వారు ఉన్నత శిఖరాలకు ఎదగటానికి ఉపయోగపడుతుంది. అమెరికాలో ఉన్న మనం బాగుండటం కాదు, మన తెలుగు వారందరూ బాగుండాలనే సదుద్దేశంతో ఆప్త వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగటం విశేషం.
ఈవెంట్‌ను సక్సెస్ చేసిన సూపూ కోటాన్, సాగర్ లగ్గిశెట్టి, రమేష్ తూము, మధు వల్లి, చంద్ర నల్లం, శ్రీనివాస్ చందు, శ్రీనివాస్ చిమట, విగయ్ సహా అందరికీ అభినందనలు. ఇలాంటి సభల్లో ఏం మాట్లాడాలనే దానిపై నాకు అవగాహన లేదు. అయితే ఎంటర్‌ప్రెన్యూమెంట్ అనేది చాలా మందిలో మనం కాలేజీలకు వెళ్లి చదవకుండానే మన మనసుల్లో అలాగే ఉండిపోయింది. నేను నో వేర్.. అనే స్థాయి నుంచి సమ్ వేర్ అనే స్థాయికి వచ్చానంటే నన్ను నేను మలుచుకున్న విధానం బట్టి, ప్రతికూల పరిస్థితులను దాటి అనుకూల పరిస్థితులను ఏర్పాటు చేసుకుని, ఎలా ఎదుగుతూ వచ్చాననేది చెబితే చాలు.. చాలా మందిని ఆలోచింప చేస్తుందనిపించింది.
నేను ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. చిన్నప్పటి నుంచి ఆటలంటే ఆసక్తితో బాల్ బాడ్మింటన్‌కు వెళ్లాను అక్కడ బాల్ నా కంటికి తగిలి వాచిపోయింది. తర్వాత వాలీబాల్ ఆట ఆడుదామని వెళితే అక్కడ కూడా బాల్ తగిలి వేళ్లు వంగిపోయాయి. క్రికెట్‌కు వెళితే బాల్ బొటనవేలుకి తగిలి వాచిపోయింది. దీంతో గేమ్స్ అచ్చిరాదనిపిస్తున్న తరుణంలో ఎన్‌సీసీలో జాయిన్ అయ్యాను. బీకాం ఫైనల్ ఇయర్‌లో ఢిల్లీలోని రాష్ట్రపతి రోడ్డుపై సైన్యంతో కలిసి కవాతు చేశాను. అదెంతో గొప్ప అనుభవం అనే చెప్పాలి. ప్రధాని ఇందిరాగాంధీగారు, రాష్ట్రపతిగారున్నారు. తర్వాత ఏంటనే దాని గురించి ఆలోచించినప్పుడు, కాలేజీలో రాజీనామా అనే డ్రామాలో యాక్ట్ చేశాను.
దాంతో కాలేజ్‌లో నన్ను అందరూ హీరోలాగా చూడటం ప్రారంభించారు. అప్పుడే నా భవిష్యత్ నటన అయితే ఎలా ఉంటుందనే ఆలోచనకు నాంది పడింది. కాలేజ్ చదువు అయిపోగానే మద్రాస్‌లో యాక్టింగ్ స్కూల్‌కి వెళతానని నాన్నగారికి చెప్పగానే అక్కడ మనకు ఎవరూ తెలియదురా.. అని అన్నారు. తెలియని ఫీల్డ్‌కు వెళ్లి రాణించగలవా? అని అన్నారు. అయితే నా మనసులో మాత్రం నేను తప్పకుండా రాణిస్తాననే గట్టి నమ్మకం అయితే ఉండింది. నేను యాక్టింగ్ స్కూల్‌లో ట్రైనింగ్ పూర్తి చేయక ముందే నాకు దర్శక నిర్మాతలు సినిమాల్లో అవకాశాలిచ్చారు. ఎప్పుడైనా పాండిబజార్‌కి వెళ్లినప్పుడు కొంత మంది నెగెటివ్‌గా మాట్లాడేవాళ్లు. కుంగిపోయేవాడిని, రూమ్‌కెళ్లి నిద్రపోయేవాడిని కాదు. ఆరోజు నాకు ఆంజనేయస్వామి మాత్రమే తోడుగా ఉండేవాడు. ఆయనతో మనసులో మాట్లాడుకునేవాడిని. ఆయనే నాకు సమాధానం చెబుతున్నట్లు ఉండేది. ఫస్ట్రేటెడ్ వాళ్ల దగ్గరకు వెళ్లకు అని ఆ భగవంతుడే చెప్పాడా? లేక నా అంతరాత్మే చెప్పిందో తెలియదు. అప్పటి నుంచి అటు వెళ్లే వాడిని కాను.
కళ్లకు గంతలు కట్టిన గుర్రంలాగా లక్ష్యం వైపు ప్రయాణించాను. సినిమాల్లో నెంబర్ వన్ కావాలనే ధ్యేయంతో ప్రయాణంచాను. ఈ లోపు నాకు అవమానాలు కూడా ఎదురయ్యాయి. పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటూ ప్రయాణించాను. నాకు నేనుగా నేర్చుకున్న ఫిలాసఫీతో ముందుకు వెళ్లాను. స్వర్గీయ ఎన్టీఆర్‌గారితో తిరుగులేని మనిషి చిత్రంలో నటించాను. ఆ సినిమాలో నాకు మంచి పేరు వచ్చింది. తర్వాత మరోసారి ఎన్టీఆర్‌గారితో మరో సినిమా చేసే అవకాశం వచ్చింది. నా దగ్గర డేట్స్ కూడా తీసుకున్నారు. నేను వెయిట్ చేస్తున్నాను. నా పేరు లేకుండా మరో నటుడికి అవకాశం రావటంతో ఎంతో డిసప్పాయింట్ అయ్యాను. అయితే ఆ టైమ్‌లో నాతో సినిమా చేస్తే పోతుందనే బ్యాడ్ అయ్యే అవకాశాలున్నాయి. దీంతో జంకాను. అయితే మళ్లీ గద్దలాగా పాజిటివ్‌గా తీసుకుని ఎదిగాను. ఎవరైతే చిరంజీవి వద్దులే అని అనుకున్నారో ఆయనతోనే రామారావుగారి కంటే నాలుగు సినిమాలు ఎక్కువగానే చేసేలా చేసుకున్నాను. ఆయనతో చేసిన సినిమానే కోటి రూపాయలు వసూలు చేసి అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది.
మీ బలం పాజిటివ్ థింకింగ్. పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవాలి. ప్రారంభంలో లక్ష్య సాధనలో నిలదొక్కుకోవాలి. డబ్బు ప్రధాన కాదు. నిలబడ్డ తర్వాత డబ్బు దానంతట అదే వస్తుంది. నాతో పని చేయని వాళ్లు, మళ్లీ చిరంజీవితో సినిమా చేయాలి అనుకునేలా నా ప్రవర్తన ఉండేది. కాస్త తగ్గటం వల్ల వచ్చే వేవ్స్ ఆటోమెటిక్‌గా నన్ను పైకి తీసుకెళుతుంది. సినీ ఇండస్ట్రీలో టాలెంట్ అనేది సెకండరీ.. నిర్మాతలతో ఎలా ఉంటావు.. వాళ్లకు ఎలా సపోర్ట్ చేశావనేది చూసుకోవాలి. టాలెంట్‌తో పాటు బిహేవియర్ కూడా ఉండాలి. రామారావుగారు పాలిటిక్స్‌కి వెళ్లిన తర్వాత ఆ గ్యాప్‌లో ఎందరో మహా నటులు.. నాగేశ్వరరావుగారు, శోభన్‌బాబుగారు, కృష్ణంరాజుగారు, కృష్ణగారు వంటి వారు ఉన్నారు. అయితే అప్పుడు ఓ కొత్త వాడికి చాన్స్ రావటం అనేది ఎంత కష్టమైన విషయమో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
మన ఎదుగుదలతో వ్యక్తిత్వం ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ప్రేక్షకులు ముందు నన్ను గుర్తించి చేయూతనిచ్చారు. రామారావుగారు రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఎవరున్నారని అందరూ అనుకుంటుంటే ముగ్గురు హీరోలు నువ్వా నేనా అన్నట్లుండేవాళ్లం. ఆ సమయంలో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌తోనే సినిమాలు నడిచేవి. ఓ హీరోతో యాబై లక్షలతో చేయాలని నిర్మాతలు అనుకుంటుంటే విజయవాడకు చెందిన లక్ష్మీ ఫిలింస్ లింగమూర్తిగారు చిరంజీవిగారితో అయితే పాతిక లక్షల్లోనే చేయవచ్చు.. అలా చేస్తే మేం పెట్టుబడి పెడతాం అన్నారు. అతనెందుకు? అని నిర్మాతలంటే.. అతను ఆల్ రెడీ ఖైదీ లాంటి సినిమా చేశాడు.. అతని డాన్సులకు మంచి ఆదరణ వస్తుంది. అతని పొటెన్షియల్ మాకు తెలుసునని అన్నారు. అప్పట్లో సాంగ్స్, ఫైట్స్ అనేవి రిఫ్రెష్‌మెంట్స్‌గా ఫీల్ అయ్యేవాళ్లని, చిరంజీవి సాంగ్స్, ఫైట్స్ ను ప్రేక్షకులు అడిగి మరీ రిపీటెడ్‌గా చూస్తున్నారని లింగమూర్తిగారన్నారు. ప్రేక్షకులు కోరుకుంటున్నారు కాబట్టి నాకు ఆదరణ దక్కింది.
తర్వాత రామారావుగారి నిర్మాతలు దేవీ ప్రసాద్‌గారు, చలసాని గోపీగారు, త్రివిక్రమ్‌గారు, ఏడిద నాగేశ్వరరావుగారు.. వంటి వారు నా షూటింగ్స్‌కు వచ్చి మాట్లాడేవాళ్లు. రామారావుగారి నిర్మాతలు నాతో సినిమాలు చేస్తున్నారంటే నేను నెంబర్ వన్ హీరో అయ్యాననిపించింది. అయ్యానని కాలర్ ఎగరేస్తే ఏమవుతుందో కూడా నాకు తెలుసు. అందుకనే అణిగిమణిగి ఉండాలని, కష్టపడి పని చేశాను. కష్టపడితే ఆ నెంబర్ అలాగే ఉంటుంది తప్ప ఎక్కడికీ పోదు. మన నైపుణ్యమేంటో గుర్తించాలి, రిస్క్ తీసుకోవాలి, డిఫరెంట్ లక్ష్యాలను ఏర్పరుచుకోవాలి.. ఇవే ఎంటర్‌ప్రెన్యూరర్‌కు ఉండాల్సిన లక్షణాలు. అవన్నీ నాకు నేనుగా ఫాలో అయ్యాను. ఫైట్స్, డాన్స్ సినిమాలే కాదు, స్వయం కృషి, చంటబ్బాయ్ వంటి వైవిధ్యమైన సినిమాలెన్నో చేశాను. ప్రేక్షకులను మోనాటనీగా ఫీల్ కాకుండా చేస్తూ వచ్చాను. మారుతున్న కాలానికి తగ్గట్టుగా కథలను మార్చుకుంటూ సినిమాలు చేశాను. నా సీనియర్ నటీనటుల నుంచి మంచి విషయాలను నేర్చుకుంటూ వచ్చాను. నా అభిమానులు నాకు కొండంత అండగా నిలబడ్డారు. వారి సహకారంతోనే నేను బ్లడ్ బ్యాంకుని స్థాపించి సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళుతున్నాను.
అలాగే ఆప్త వాళ్లు కూడా ఎన్నోసార్లు అమెరికాలో రక్తదాన శిబిరాలను నిర్వహించారు. ఇలా నా గురించి నేను చెప్పుకోవటంలోనే తెలియకుండా మీ అందరికీ చెప్పాల్సిన విషయాలను చెప్పానని అనుకుంటున్నాను. ఈ తీరుతో మనం ముందుకు వెళితే ఎదురు ఉండదు. నా ప్రయాణంలో నేను ఇన్‌స్పిరేషన్‌గా ఎలాగైతే నిలిచానో ఇక్కడున్న వారందరూ భవిష్యత్తులో రాబోయే ఎంటర్‌ప్రెన్యూరర్స్‌కి ఇన్‌స్పిరేషన్‌గా నిలవాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, నా ఫ్యామిలీలోని నా బిడ్డలందరూ నా అచీవ్‌మెంటే. మొన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినప్పుడు.. అన్నయ్య నువ్వొక మాట అనేవాడిని గుర్తుందా.. మన ఇంట్లో ఇంత మంది మీరున్నందుకు? ఈ అవకాశం నాకు భగవంతుడు ఇచ్చినందుకు, ఇది నాతో ఆగిపోకూడదు. ఒక రాజ్ కపూర్ ఫ్యామిలీలో ఎంత మంది ఎలా ఉన్నారో, ఆ రకంగా మరో రాజ్ కపూర్ ఫ్యామిలీలా మన మెగా ఫ్యామిలీ కావాలని నువ్వు చెప్పావు అన్నారు.
ఈరోజు నీ మాట మంత్రంలాగా పని చేసింది. నువ్వు కన్విక్షన్‌తో అంటావు.. అందులో ఎలాంటి పొల్యూషన్ ఉండదు. ఈ మధ్య ఓ పత్రిక కపూర్ ఫ్యామిలీ ఆఫ్ సౌత్ అని మా గురించి ప్రస్తావించినప్పుడు భగవంతుడా! ఇది నా గొప్పదనం కాదు, నువ్వు, ప్రేక్షకులు, అభిమానులు ఇలా ఆదరించారు కాబట్టే ఇక్కడున్నామని అనుకున్నాను. ఈ సందర్భంలో చలమశెట్టి అనీల్(గోపి)కి ప్రత్యేకమైన అభినందనలు అన్నారు.