అర్కా మీడియా, కార్తికేయ నిర్మిస్తున్న సినిమాల్లో ఫహాద్ ఫాజిల్‌

డీవీ

మంగళవారం, 19 మార్చి 2024 (18:12 IST)
Oxygen - Don't Trouble The Trouble
 
ఎస్.ఎస్.రాజమౌళి తనయుడు కార్తికేయ రీసెంట్‌గా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘ప్రేమలు’ చిత్రం కార్తికేయ సమర్పణలో తెలుగులో విడుదలైంది. ప్రముఖ బ్యానర్స్‌పై ‘ప్రేమలు’ చిత్రాన్ని కార్తికేయ తెలుగు ప్రేక్షకులు అందించారు. ఇక్కడ కూడా సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ విజయం అందించిన నమ్మకంతో ఎస్.ఎస్.కార్తికేయ ఇప్పుడు నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టారు.
 
కార్తికేయతో బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ చేతులు కలుపుతున్నారు. డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి ఈ చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
 
కార్తికేయ తెలుగులో విడుదల చేసిన ప్రేమలు చిత్రానికి ఫహాద్ పాజిల్ కూడా ఓ నిర్మాత.కాగా, ఈ రెండు చిత్రాల్లోనూ ప్రధాన పాత్రలో ఫహాద్ పాజిల్ కనిపించబోతున్నారు. అందులో ఒకటి స్నేహాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిస్తోన్న ‘ఆక్సిజన్’ చిత్రం. ఈ సినిమాతో సిద్ధార్థ్ నాదెళ్ల దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. మరో చిత్రం థ్రిల్లింగ్ ఫాంటసీ కథాంశంతో రూపొందనున్న చిత్రం. దీనికి ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంతోనూ శశాంక్ ఏలేటి దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ రెండు చిత్రాలకు వేటికవే భిన్నమైనవి, కంటెంట్ బేస్డ్ మూవీస్ కూడా.  
 
ఎస్.ఎస్.కార్తికేయ మాట్లాడుతూ ‘‘డిస్ట్రిబ్యూటర్‌గా నా తొలి చిత్రం ‘ప్రేమలు’ ద్వారా నాకు విజయాన్ని అందించి నాపై మీకున్న అపరిమితమైన ప్రేమను తెలియజేశారు. దీంతో మంచి చిత్రాలకు భాషాపరమైన బేదాలుండవనే నమ్మకం నాలో మరింతగా పెరిగింది. ప్రేమలు చిత్రాన్ని పంపిణీ చేయటం, థియేటర్స్‌కు ఆడియెన్స్ ఎలా వచ్చారనే విషయాలను చెక్ చేసుకోవటం, ప్రతీ టికెట్‌ అమ్ముడైనప్పుడు, హౌస్ ఫుల్ థియేటర్ చూసినప్పుడు ఇలా ప్రతీ విషయాన్ని ఎంజాయ్ చేశాను. గత ఏడాది మా ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ వచ్చినప్పుడు కూడా నేను ఇలాంటి గొప్ప ఆనందాన్నే పొందాను.
 
రెండేళ్ల ముందు సిద్ధార్థ్ నాదెళ్లతో కలిసి స్నేహం మీద స్ఫూర్తిదాయకమైన కథ కోసం పని చేస్తున్నప్పుడు, అనుకోకుండా థ్రిల్లింగ్ ఫాంటసీ కథ ఒకటి నా దగ్గరకొచ్చింది. డెబ్యూ డైరెక్టర్ శశాంక్ ఏలేటి చెప్పిన ఈ కథ కూడా నన్నెంతో ఎగ్జయిట్ అయ్యేలా చేసింది. రెండు కథలను ఒకే స్టార్ ఒప్పుకుంటారని అనుకోలేదు. అలాంటి ఫహాద్ ఫాజిల్ గారు తొలిసారి కథ వినగానే రెండింటిలో నటించటానికి ఒప్పుకున్నారు. ఫహాద్‌గారు బహుముఖ ప్రజ్ఞకు ప్రతిరూపం, నేనెంతగానో ఆరాధించే వ్యక్తి. ఐ లవ్ యూ సో మచ్ సార్. ఇదే మీపై మాకున్న ‘ప్రేమలు’అలాగే శోభుగారికి కూడా ధన్యవాదాలు. ఆయనెంతగానో నన్ను ప్రోత్సహించటమే కాకుండా ఈ ప్రయాణంలో నాతో పాటు చేతులు కలిపారు’’ అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు