బాహుబలి 2 డబ్బులు ఇంకా రాలేదు.. లీగల్ నోటీసులు

సోమవారం, 25 మార్చి 2019 (17:10 IST)
బాహుబలి సిరీస్‌లో రెండవ భాగం విడుదలై దాదాపు రెండేళ్లు గడుస్తున్నా పేమెంట్‌కు సంబంధించి ఇంకా కొన్ని వ్యవహారాలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో బాహుబలి నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్ తరఫున శోభు యార్లగడ్డ తమిళనాడుకు చెందిన 'కె ప్రొడక్షన్స్' అధినేత రాజరాజన్‌‌కు లీగల్ నోటీసులు పంపారు.


బాహుబలి కొనుగోలుకు సంబంధించి రాజరాజన్ ఇచ్చిన రూ. 17.60 కోట్ల చెక్ బౌన్స్ అయినందువల్ల ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
 
కోలీవుడ్‌లో ఉన్న ప్రముఖ సినీ డిస్ట్రిబ్యూషన్ సంస్థలలో రాజరాజన్‌కు చెందిన ‘కె ప్రొడక్షన్స్' ఒకటి. ఈ సంస్థ బాహుబలి 2ని తమిళనాడులో విడుదల చేయడానికి థియేట్రికల్ రైట్స్‌ను రూ. 52 కోట్లకు స్వంతం చేసుకుంది. అయితే రాజరాజన్ ఇందుకు సంబంధించి ఇంకా రూ. 17.60 కోట్లు చెల్లించాల్సి ఉంది, ఈ మొత్తాన్ని అతను చెక్కు రూపంలో అందించగా ఆ చెక్కు బౌన్స్ అయ్యింది. 
 
కె ప్రొడక్షన్స్ సంస్థ మీద లీగల్ నోటీసులు జారీ చేయడం జరిగింది. వారంలోగా డబ్బు చెల్లించకపోతే సంస్థ బ్యాంక్ అకౌంట్స్ ఎటాచ్ చేసే అవకాశం ఉంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చారిత్రాత్మక సినిమా ‘బాహుబలి 2' ఏప్రిల్ 28 2017వ తేదీన విడుదలై దేశవ్యాప్తంగా రికార్డులను కొల్లగొట్టిన విషయం తెలిసిందే.
 
ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 1800 కోట్లు పైగా వసూలు చేసింది. తమిళనాడులో కూడా రూ. 152 కోట్లకు పైగా వసూలు చేసింది. అంటే కె ప్రొడక్షన్స్ వారికి తాము పెట్టిన పెట్టుబడి కంటే సుమారు రూ. 26 కోట్లు లాభాలు వచ్చాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు