బాహుబలి కిలికిరి సైన్యంలా ఏపీలో బీజేపీ: డొక్కా వ్యాఖ్య

గురువారం, 4 అక్టోబరు 2018 (20:07 IST)
అమరావతి : ఏపీలో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడమే ధ్యేయంగా బీజేపీ నాయకులు మిడతల దండులా, బాహుబలి కిలికిరి సైన్యంలా ప్రయత్నిస్తున్నారని ఏపీ శాసనమండలి విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. 4 ఏళ్లలో రాయలసీమలో జరుగుతున్న పారిశ్రామికాభివృద్ధికి చర్చకు సిద్ధమా అని ఆయన బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్రాభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు చేస్తున్న కృషి కళ్లకు కనిపించడంలేదా అని ఆ పార్టీ నేతలను నిలదీశారు. బీజేపీ రాజకీయ సిద్ధాంతం ప్రాంతీయ విబేధాలపైనే ఆధారపడి ఉందన్నారు. 
 
దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారని ఏపీ శాసనమండలి విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి రాకముందు ఆ రాష్ట్రాన్ని 4 రాష్ట్రాలుగా విభజిస్తామన్నారు. ఇపుడు అధికారంలోకి వచ్చిన తరవాత విభజన ఊసే ఎత్తడం లేదన్నారు. రాష్ట్ర పునర్విభజన కారణంగా ఏపీ తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయిందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు తన నాయకత్వ పటిమతో ఏపీ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పరుస్తున్నారన్నారు. ఇది చూసి ఓర్వలేని బీజేపీ నాయకులు మిడతల దండులా, బాహుబలి సినిమాలోని కిలికిరి సైన్యంలా ఏపీలో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. 
 
రాయలసీమ డిక్లరేషన్ అంటూ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్న బీజేపీ నాయకులు వెనుకబడిన ప్రాంతాలకు ఎందుకు ప్యాకేజీ ఇవ్వలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. రాయలసీమ అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఏపీ శాసనమండలి విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు. తిరుపతిని మొబైల్ మాన్యూఫాక్చరింగ్ హబ్‌గా మార్చామన్నారు. దేశంలో తయారయ్యే 5 ఫోన్లలో ఒకటి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినదేనన్నారు. నేడు తిరుపతిలో డిక్సన్ రెండో యూనిట్‌ను సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారన్నారు. దేశంలో ఎలక్ట్రానిక్ హబ్‌గా హర్యానాలోని గుర్గామ్ మొదటిస్థానంలో ఉంటే, తిరుపతి రెండో స్థానంలో ఉందన్నారు.
 
బీజేపీ పట్ల బహుపరాక్...
రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని శాసనమండలి విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబునాయుడు ఏపీ బ్రాండ్ అంబాసిడర్ అని, ఆయనకున్న ఇమేజ్‌తోనే రాష్ట్రానికి పరిశ్రమలు తరలొస్తున్నాయని వెల్లడించారు. వైసీపీతో బీజేపీకి ఉన్న ప్రేమాయాణాన్ని కమలనాథులు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమపై చిత్తశుద్ధి ఉంటే, తక్షణమే కడప ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని డిమాండ్ చేశారు. నిలిచిపోయిన వెనుకబడిన ప్రాంతాలకిచ్చే నిధులను రాబట్టాలన్నారు. డిక్సన్ వంటి కంపెనీలు వస్తున్న సమయంలో ఏపీని అప్రదిష్ట పాలు చేసేలా బీజేపీ నాయకులు వ్యవహరించొద్దని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టాలని చూస్తున్న బీజేపీ నాయకుల పట్ల ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బహుపరాక్ అని ఏపీ శాసనమండలి విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు